- మున్సిపల్ ఎన్నికల్లో ఇరు వర్గాల నుంచి భారీగా నామినేషన్లు
- చైర్‌పర్సన్ రేసులోనూ ఇద్దరు ముఖ్యనేతల భార్యలు
- రెండు వర్గాల పోరులో తమకే లాభమంటున్న బీఆర్ఎస్ లీడర్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మున్సిపాలిటీపై ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వార్డు సభ్యుల స్థానాల కోసం ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో 20 వార్డులకు కాంగ్రెస్ తరఫునే 92 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఒక్కో అభ్యర్థి నుంచి ఒక నామినేషన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో స్క్రూట్నీ తర్వాత 70 నామినేషన్లు మిగిలాయి. ఇప్పటికీ ఒక్కో వార్డుకు ముగ్గురికి పైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్డులో ఒక్కరికే బీ ఫామ్ ఇచ్చి, మిగిలిన వారిని బుజ్జగించడం, నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించడం ఆ పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారింది.
చైర్‌పర్సన్ పోస్ట్ కోసం పోటాపోటీ...
వైరా నియోజకవర్గ కాంగ్రెస్‌లో మొదటి నుంచీ రెండు వర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అందరూ కలిసి పనిచేసినా, స్థానిక ఎన్నికలకు వచ్చే సరికి పదవుల కోసం ఎవరికి వారు గాడ్‌ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గానికి చెందిన జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుడైన మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ రెండు వర్గాలతోనూ చర్చలు జరిపారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఈ సారి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పువ్వాళ్ల దుర్గాప్రసాద్ భార్య ఇందుమతి, బొర్రా రాజశేఖర్ భార్య, మాజీ జడ్పీటీసీ ఉమాదేవి పోటీపడుతున్నారు. మరో వైపు వార్డులకు కూడా ఈ రెండు వర్గాల నుంచి భారీ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఉపసంహరణ గడువు ముగిసేలోగా.. బీఫామ్ దక్కిన వారు మినహా.. మిగతా వారు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేలా చర్చలు జరుపుతున్నారు.
ఒక వర్గానికి చైర్‌పర్సన్, మరో వర్గానికి వైస్‌చైర్మన్ పదవులను కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ.. రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ప్రచారం జరుగుతోంది. పోటీ నుంచి తప్పుకున్న వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఉంటుందని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు.
పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నా..
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. వైరాలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ నామినేషన్ల ఉపసంహరణపై ప్రకటన చేశారు. వైరాకే చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ వంటి నేతలు సైతం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేసినా ఫలిడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇటు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అటు బొర్రా రాజశేఖర్ ఫ్యామిలీలు రెండూ రాజకీయ నేపథ్యం ఉన్నవే కావడం.. రెండు వర్గాలకు ఇద్దరు మంత్రుల అండదండలు ఉండటంతో పదవుల పంపిణీపై పీటముడి పడిందన్న చర్చ జరుగుతోంది. మంత్రులు నేరుగా జోక్యం చేసుకుంటే తప్పించి, ఈ చిక్కుముడి వీడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమకు కలిసొస్తుందంటున్న బీఆర్‌ఎస్
వైరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో జరుగుతున్న వర్గపోరు తమకు కలిసివస్తుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ చనిపోయిన తర్వాత కేడర్ ఛిన్నాభిన్నమైంది. మదన్‌లాల్ భార్య మంజుల, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి నాయకత్వ పగ్గాల కోసం పోటీ పడుతున్నారు. కాగా, వైరా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఎలక్షన్లలో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారు.
