షావోమీకి షాక్.. రూ. 5551 కోట్లు సీజ్ చేసిన ఈడీ

షావోమీకి షాక్.. రూ. 5551 కోట్లు సీజ్ చేసిన ఈడీ
  •     ఫారెన్​ కరెన్సీ రూల్స్​ను పాటించకపోవడమే కారణం
  •     చట్టప్రకారమే అన్నీ చేశామన్న షావోమీ

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్​ కంపెనీ షావోమీ ‘ఇండియన్​ ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ చట్టం’ లోని రూల్స్​కు వ్యతిరేకంగా లావాదేవీలు చేసిందని పేర్కొంటూ ఈడీ రూ.5,551 కోట్ల డబ్బును సీజ్​ చేసింది. ఈ డబ్బంతా షావోమీ ఇండియా బ్యాంకు ఖాతాల్లో ఉందని తెలిపింది. ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ (ఫెమా) చట్ట ప్రకారం ఈ చర్య తీసుకుంది. ‘‘ఈ కంపెనీ చట్టవిరుద్ధంగా చైనాకు ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున డబ్బు పంపింది. షావోమీ భారతదేశంలో తన కార్యకలాపాలను 2014లో ప్రారంభించింది.  మరుసటి సంవత్సరం నుంచే డబ్బును పంపడం ప్రారంభించింది. మూడు విదేశీ  సంస్థలకు కంపెనీ రాయల్టీ ముసుగులో రూ. 5,551.27 కోట్లకు సమానమైన విదేశీ కరెన్సీని పంపింది. రాయల్టీల పేరుతో ఇంత భారీ మొత్తాలను వారి చైనీస్ “పేరెంట్ గ్రూప్” సంస్థల సూచనల మేరకే పంపించింది.  మరో రెండు యూఎస్​  సంస్థలకు పంపిన మొత్తం కూడా షావోమీ గ్రూప్ ఎంటిటీల కోసమే!  ఇండియాలోనే పూర్తిగా తయారైన మొబైల్ సెట్లను,  ఇతర ప్రొడక్టులను ఈ కంపెనీ కొనుగోలు చేస్తున్నది. పైన చెప్పిన మూడు విదేశీ  సంస్థల నుండి ఎటువంటి సేవలను కంపెనీ పొందలేదు. ఆ ట్రాన్సాక్షన్లలో  వ్యాపార సంబంధాలు లేవని పేర్కొంది. అయినప్పటికీ రాయల్టీ ముసుగులో విదేశాలకు డబ్బు పంపడం ఫెమాలోని సెక్షన్ 4కు వ్యతిరేకం.   విదేశాలకు డబ్బును పంపడానికి బ్యాంకులకు "తప్పుడు సమాచారం" అందించింది. ఇదే కేసు విషయమై ఈ నెల ప్రారంభంలో, కర్ణాటకలోని బెంగళూరులోని ఏజెన్సీ రీజనల్​ ఆఫీసులో గ్రూప్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్‌ను కూడా ప్రశ్నించాం”అని ఈడీ తెలిపింది.

మేం తప్పు చేయలేదు: షావోమీ

ఈడీ తమ డబ్బును సీజ్​ చేయడంపై షావోమీ స్పందించింది.  తాము ఇండియా చట్టాలను పూర్తిగా పాటిస్తామని, తమ రాయల్టీ చెల్లింపులు చట్టబద్ధమైనవని అని పేర్కొంది. ‘‘ ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్డర్‌ను జాగ్రత్తగా స్టడీ చేశాం. మా రాయల్టీ చెల్లింపులు , బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌  చట్టసమ్మతమైనవని, నిజమైనవనీ మేం నమ్ముతున్నాం.  మా భారతీయ వెర్షన్ ప్రొడక్టుల కోసం ఉపయోగించిన ఇన్-లైసెన్స్ టెక్నాలజీల కోసం, ఐపీల కోసం  ఈ రాయల్టీలను చెల్లించాం”ఇది ఒక ప్రకటనలో పేర్కొంది. షావోమీ ఇండియా ఎంఐ, రెడ్​మీ, పోకో పేర్లతో ఫోన్లను, ఎలక్ట్రానిక్స్​ వస్తువులను అమ్ముతుంది. ఇండియా ఇది వరకే చైనాకు చెందిన పలు యాప్స్​ను బ్యాన్​చేసింది. వీటిలో షావోమీ యాప్స్​ కూడా ఉన్నాయి. తాజాగా షావోమీ డబ్బు సీజ్​ అయింది. దీనివల్ల ఇండియా–చైనా వ్యాపార సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే షావోమీ ఇండియాలో టాప్​–3 మొబైల్​ బ్రాండ్లలో ఒకటి.