నల్గొండ జిల్లాలో పాల కల్తీని అరికట్టాలి : కలెక్టర్ ఏ. భాస్కర రావు

నల్గొండ జిల్లాలో పాల కల్తీని అరికట్టాలి :  కలెక్టర్ ఏ. భాస్కర రావు
  •     తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, వెలుగు :   జిల్లాలో  సమస్యగా మారిన పాల కల్తీని అరికట్టేందుకు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు ఆదేశించారు. ఆహార కల్తీపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులు సహా అందరూ వినియోగించే పాలలో కల్తీ చేస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. 

నిందితులపై పటిష్టమైన కేసులు నమోదు చేయాలన్నారు. అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసే గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పండ్లు, కూరగాయల సాగులో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సమావేశంలో డీవో పి. స్వాతి, డీఎంహెచ్‌‌వో మనోహర్, డీఈవో సత్యనారాయణ, వెల్ఫేర్ అధికారి నర్సింహారావు, సీఐ చంద్రబాబు పాల్గొన్నారు.