రైస్ మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి : యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రైస్ మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి : యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చౌటుప్పల్, : రైస్ మిల్లులకు ధాన్యం లోడ్‌‌తో వచ్చే లారీలను వెంటనే అన్లోడ్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలోని మల్లికార్జున రైస్ మిల్లును ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అడిషనల్​ కలెక్టర్ వెంక రెడ్డి తో కలిసి ఆయన తనిఖీ చేశారు. మిల్లులో ప్రస్తుతం ధాన్యం లోడ్‌‌తో ఎన్ని లారీలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. లారీలు వచ్చిన వెంటనే హమాలీలతో అన్లోడ్ చేయాలని సూచించారు. 

ఒక్కో లారీ అన్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వివరాలు తెలుసుకున్నారు. హమాలీలు సరిపడా లేకపోతే అదనంగా నియమించుకొని ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకూడదని, వచ్చిన రోజే అన్లోడ్ చేసి పంపాలని స్పష్టం చేశారు. అనంతరం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలను పరిశీలించి, కాంటా వేసిన వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.