- యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట, వెలుగు: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పరిశీలించారు. గ్రామంలో మంజూరైన ఇండ్లు, పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని ఇండ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి కారణాలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ శ్రీరాములు, ఎంపీడీవో గీతారెడ్డి, హౌసింగ్ ఏఈ నరేష్, విలేజ్ సెక్రటరీ నవీన్, ఏపీవో నారాయణ తదితరులు ఉన్నారు.
