రూ.780 కోట్లతో యాదాద్రి గుడి రెడీ

రూ.780 కోట్లతో యాదాద్రి గుడి రెడీ
  •     పనులు 99 శాతం పూర్తి: వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్​రావు
  •     మిగతా పనులను జనవరిలోగా కంప్లీట్ చేస్తం
  •     ప్రారంభ తేదీపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటరు
  •     దాదాపు రెండేళ్ల తర్వాత మీడియాకు అనుమతిచ్చిన అధికారులు

యాదాద్రి, వెలుగు: రూ.780 కోట్లతో చేపట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్​రావు తెలిపారు. మిగిలిన పనులను జనవరిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రారంభోత్సవం ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. టెంపుల్​ఈవో గీతారెడ్డితో కలిసి యాదగిరికొండపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ నిర్మాణం చేపట్టాక భారీ వర్షాలు, కరోనాతో అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పనులను యజ్ఞంలా భావించి దాదాపుగా పూర్తి చేశామని వివరించారు.

చిన్న సమస్యలు కామన్

గర్భాలయం నుంచి 80 ఫీట్ల ఎత్తు లేపి మట్టి నింపడం వల్ల కొన్ని చోట్ల కుంగిపోయిందని, ఇంత పెద్ద నిర్మాణంలో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు కామన్ అని కిషన్​రావు చెప్పారు.టెంపుల్ నిర్మాణం, సేకరించిన ల్యాండ్ డెవలప్​మెంట్ కోసం ఇప్పటిదాకా రూ.780 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందులో టెంపుల్​కు ఖర్చు చేసింది రూ.270 కోట్లని వివరించారు. మిగిలిన సొమ్ముతో 890 ఎకరాల భూమిని సేకరించామని, ఇందులో 250 ఎకరాల భూమిని డెవలప్ చేశామని చెప్పారు. దేవస్థానం నుంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదని, పూర్తిగా ప్రభుత్వమే కేటాయించిందన్నారు.

580 కాటేజీలు నిర్మిస్తం

టెంపుల్ సిటీలో 580 కాటేజీలు నిర్మిస్తామని కిషన్​రావు తెలిపారు. అక్కడే స్టార్ హోటళ్లు, కల్యాణ మండపాలు కడతామని చెప్పారు. గండి చెరువును పుష్కరిణిగా మారుస్తామని, పక్కనే కల్యాణకట్ట, బస్టాండ్​ ఏర్పాటు చేస్తామన్నారు. రాయగిరి వద్ద మినీ శిల్పారామం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. విమాన గోపురాలపై బంగారు తాపడం చేయడానికి మరో రూ.46 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. కొండపై 108 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. అంతపెద్ద రాయి దొరికే పరిస్థితి లేదన్నారు. ఇందుకోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. టెంపుల్ ప్రారంభమైన తర్వాత యాదాద్రికి రోజూ 500 బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. టెంపుల్ ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘ఇది కరోనా టైం కదా?’ అన్నారు. సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా ప్రారంభోత్సవానికి పెద్ద యాగం చేయాల్సి ఉంటుందని, వేలాది మందిని ఆహ్వానించాల్సి వస్తుందని, అందుకే ఆయన నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.

రెండేళ్ల తర్వాత మీడియాకు పర్మిషన్

టెంపుల్ నిర్మాణ పనులను చూడటానికి రెండేళ్ల త ర్వాత మంగళవారం మీడియాకు అనుమతిచ్చారు. 2016 లో పనులు స్టార్టవగా మొదట్లో కొద్ది రోజులు మీడియాకు పర్మిషన్ ఇచ్చి తర్వాత రానివ్వలేదు. పను లు నాసిరకంగా జరుగుతున్నాయని వార్తలు వచ్చినా అదేం లేదని ఆలయ అధికారులు చెప్పారు. తాజాగా పనులు చివరి దశకు వచ్చాయని చూపడానికి మీడియాకు పర్మిషన్ ఇచ్చారు. 99% పనులు పూర్తయ్యాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్​రావు చెబుతున్నా గుడి లోపలి పరిస్థితులు అట్లా కనిపించట్లేదు.