ఫేక్ సంఘాలు ఎవరెవరితో ఏర్పాటు చేశారు?..రుణాల గోల్మాల్పై సీవోను విచారించిన మెప్మా

ఫేక్ సంఘాలు ఎవరెవరితో ఏర్పాటు చేశారు?..రుణాల గోల్మాల్పై సీవోను విచారించిన మెప్మా

యాదాద్రి, వెలుగు: భువనగిరిలో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారుల బృందం సోమవారం విచారణ నిర్వహించింది. సభ్యులు లేకుండానే 38 సంఘాలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంకు నుంచి రూ.7.99 కోట్ల రుణాలు పొందిన ఘటనపై ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ ఎ.భాస్కరరావు విచారణ జరిపి నివేదికను బ్యాంకు, మెప్మా ఉన్నతాధికారులకు అందజేశారు. 

ఈ నివేదిక ఆధారంగా హైదరాబాద్‌‌‌‌ నుంచి కృష్ణచైతన్య, నారాయణ సహా ఐదుగురు అధికారులతో కూడిన మెప్మా బృందం భువనగిరి మున్సిపాలిటీలో కమ్యూనిటీ కోఆర్డినేటర్(సీవో) సువర్ణను విచారించింది. రిసోర్స్ పర్సన్ల నుంచి ఎంత మొత్తం తీసుకున్నారో, ఫేక్ సంఘాల ఏర్పాటు వెనుక ఎవరు ఉన్నారో వివరాలు చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిసింది. 

ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ, ఎవరెవరితో కలిసి నకిలీ సంఘాలు ఏర్పాటు చేశారని, అందులో మీ బంధువులు ఉన్నారన్న ఆరోపణలు నిజమేనా అని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫేక్ సంఘాల పేరిట ఎంత మొత్తం రుణాలు పొందారనే అంశంపైనా ఆరా తీశారు. 

అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు రిసోర్స్ పర్సన్లను కూడా పిలిపించి విచారించారు. సువర్ణతో పాటు రిసోర్స్ పర్సన్లు ఇచ్చిన వివరాలను నమోదు చేసుకున్న విచారణ బృందం హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వెళ్లింది. కాగా ఈ వ్యవహారంపై మరో విడత విచారణ జరిగే అవకాశముందని స్థానిక మెప్మా వర్గాలు చెబుతున్నాయి.