
ఎల్ బీ నగర్, వెలుగు: యాదాద్రి జిల్లా పాతనరసింహ దేవాలయం వద్ద గురువారం పోలీస్ వాహనం దూసుకెళ్లి తీవ్ర గాయాలైన మూడేళ్ల చిన్నారి ప్రణతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సిటీలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చిన్నారికి వెంటిలేషన్ పై చికిత్స అందిస్తోంది. న్యూరో, జనరల్, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన డాక్టర్ల బృందం ప్రణతికి చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం నుండి క్రిటికల్ కేర్ లో చికిత్స అంధిస్తున్నామన్నారు.
తాము చేస్తున్న వైద్యానికి చిన్నారి రెస్పాండ్ కావడంలేదని, బీపీ లేవల్స్ మాత్రమే నమోదవుతున్నట్టు చెప్పారు. చిన్నారికి తలకు, కడుపులో బలమైన గాయాలయ్యాయని, పక్కటెముకలతోపాటు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని రాచకోండ పోలీస్ కమిషనర్మహేశ్ భగవత్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరి కొద్ది సేపట్లలో హెల్త్ బులిటన్ విడుదల చేస్తామన్నారు డాక్టర్లు.