యాదాద్రి జిల్లాలో కొత్త పాలసీతో మైనింగ్ శాఖకు పెరిగిన ఆదాయం

యాదాద్రి జిల్లాలో కొత్త పాలసీతో మైనింగ్ శాఖకు  పెరిగిన ఆదాయం
  • యాదాద్రి జిల్లాలో ఐదు నెలల్లోనే  రూ. 34 కోట్ల అదనపు రాబడి

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాలో మైనింగ్ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కొత్త పాలసీ కారణంగా భారీగా పెరిగింది. గతంలో క్వారీలు, క్రషర్ల నిర్వాహకులు ఉత్పత్తిని తక్కువగా చూపిస్తూ సీనరేజీ ఫీజు ఎగ్గొట్టేవారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ నుంచి విద్యుత్ వినియోగం ఆధారంగా ఉత్పత్తిని లెక్కించే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 

ఈ విధానం ప్రకారం, ప్రతీ 4 యూనిట్ల విద్యుత్ వినియోగానికి ఒక టన్ను ఉత్పత్తి జరిగినట్లుగా నిర్ధారిస్తారు. దీనివల్ల కాంట్రాక్టర్లు తప్పించుకునే అవకాశం లేకుండా పోవడంతో సీనరేజీ ఫీజు చెల్లింపులు గణనీయంగా పెరిగాయి.  జిల్లాలో ప్రస్తుతం 71 క్వారీలు, 45 క్రషర్లు కొనసాగుతుండగా, 2024-–25 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ శాఖకు రూ. 83.33 కోట్ల ఆదాయం లభించింది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన కేవలం ఐదు నెలల్లోనే (నవంబర్ నుంచి మార్చి వరకు) పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు తేలడంతో, సీనరేజీ ఫీజు రూపంలో ఏకంగా రూ. 117.89 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే పాత విధానంతో పోలిస్తే కేవలం ఐదు నెలల కాలంలోనే రూ. 34 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.