యాదాద్రి, వెలుగు : పేరెంట్స్ పోషించడంతో పాటు ప్రతినెలా రూ. 2 వేల చొప్పున ఇవ్వాలని వారి సంతానాన్ని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి ఆదేశించారు. రూ. 2 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని ఆయన ఆదేశించారు. ‘తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007’ కింద న్యాయం చేయాలని వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ సబ్ డివిజనల్ ట్రిబ్యునల్‌ను పలువురు పేరెంట్స్ ఆశ్రయించారు.
దీంతో ఆర్డీవో కృష్ణారెడ్డి శుక్రవారం పది కేసులను విచారించారు. ఇందులో ఆరుగురు పేరెంట్స్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు. ఆత్మకూరు (ఎం) పల్లెర్లకు చెందిన గుండెబోయిన యాదయ్యకు ఆయన ఇద్దరు కుమారులు రూ. 2 వేల చొప్పున రూ. 4 వేలు జమ చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఇద్దరు కలిసి రూ. 4 లక్షలు ఇవ్వాలన్నారు. ఇలా పలు కేసుల్లోనూ ఆయన ఆదేశాలు జారీ చేస్తూ, అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
