హైదరాబాద్: టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి యాదగిరి గుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వచ్చే నెల రోజుల్లో యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళవారం (జనవరి 20) సైదాపురం గ్రామంలో అంగన్ వాడీ బిల్డింగ్స్ ప్రారంభోత్సవం, సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి కొండపై అభివృద్ధితో పాటు యాదగిరి గుట్ట మున్సిపాలిటీని కూడా మోడల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించాడని తెలిపారు. ఆలేరు నియోజకవర్గం లో రోడ్ల నిర్మాణానికి రూ.320 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి రోడ్లన్నీ బాగు చేస్తామన్నారు.
మూటకొండూర్ మీదుగా గుండాల వరకు డబుల్ రోడ్డు పనులు చేస్తామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.80 కోట్ల అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. ఇక, మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయన్నారు. మేడారంలో మనదేవతలు సమ్మక్క, సారలమ్మల గద్దెలు భక్తుల కోరుకున్న విధంగా నిర్మించామని చెప్పారు.
