యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ (వైటీడీ) పాలకమండలి శనివారం కొలువుదీరనుంది. ఉదయం 11:37 గంటలకు ప్రధానాలయ ముఖ మంటపంలో వైటీడీ బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు 10 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆలయ చరిత్రలో దాదాపు 17 ఏండ్ల తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటు కాగా, అనువంశిక ధర్మకర్త కాకుండా ఇతరులు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.
బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నరసింహమూర్తి, బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
