యాదగిరిగుట్ట, వెలుగు: తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టాత్మకమైన 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుకు చేరువైంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆలయంలో అమలు చేస్తున్న డిజిటల్ సేవలపై ఆలయ ఈవో భవాని శంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి 802 దరఖాస్తులు రాగా.. ఉత్తమంగా ఎంపికైన 32 ప్రాజెక్టుల్లో యాదగిరిగుట్ట దేవస్థానం చోటు దక్కించుకుంది.
ఏప్రిల్ 8, 19 తేదీల్లో జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి డిజిటల్ సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫైనల్ ప్రెజెంటేషన్‌లో దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్, స్వామివారి సేవల టికెట్ల జారీ వంటి ఆన్లైన్ సౌకర్యాలపై అధికారులు వివరించారు. భక్తులకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు వినూత్న డిజిటల్ విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సేవలతో యాదగిరిగుట్ట ఆలయానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమని, ప్రతిష్టాత్మక ఈ-గవర్నెన్స్ అవార్డు ఆలయాన్ని తప్పక లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
