- 32 వేల మంది ఆధార్, బ్యాంక్ పాస్ బుక్స్ చెక్ చేస్తున్న అధికారులు
- మున్సిపాలిటీల వారీగా సంఘాలను అడిట్ చేస్తున్నరు
- నకిలీ సంఘమైతే ఆర్పీలపై నాన్ బెయిల్ కేసులు
యాదాద్రి, వెలుగు : ఫేక్సంఘాలకు లోన్లు మంజూరు చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఆఫీసర్లు అలర్టయ్యారు. యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సంఘాలు ఎన్ని? అందులో అసలు, నకిలీ సంఘాలు, సభ్యుల లెక్కలను జల్లెడ పడుతున్నారు. ప్రతి సభ్యురాలి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్స్ చెక్ చేయనున్నారు. ఏమాత్రం అవతకవకలు జరిగినట్టు తేలినా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు.
యాదాద్రిలో 18,652 సంఘాలు..
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో సెర్ఫ్ పరిధిలో 15,212 మహిళా సంఘాలు ఉండగా, 1,57,784 మంది మెంబర్లున్నారు. మెప్మా పరిధిలోని ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 3,440 సంఘాలుండగా 32,757 మంది మెంబర్లు ఉన్నారు. మహిళలు సక్రమంగా చెల్లిస్తారన్న ఉద్దేశంతో ఏటేటా సంఘాలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి నుంచి పెద్ద మొత్తంలో లోన్లు మంజూరు చేస్తున్నారు. వీటితో పాటు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నారు.
కొన్ని సంఘాలు తాము తీసుకున్న లోన్లను సక్రమంగా చెల్లించక పోవడంతో బకాయిలు పేరుకొని పోతున్నాయి. దీంతో ఆయా సంఘాల్లోని సభ్యులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకులు, స్త్రీనిధి నుంచి నోటీసులు రావడంతో మహిళా సంఘాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏ సంఘంలో లేని తాము లోన్లు ఎక్కడ తీసుకున్నామంటూ భువనగిరిలోని 38 సంఘాల మెంబర్లు ఫిర్యాదు చేశారు.
చౌటుప్పల్‌లోని ఓ సంఘం నుంచి తాము తీసుకున్న లోన్ కంటే ఎక్కువ తీసుకున్నట్టుగా చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఆఫీసర్లు 38 ఫేక్ సంఘాలకు బ్యాంకుల నుంచి రూ. 7.99 కోట్లు మంజూరు చేసినట్టుగా గుర్తించి నలుగురు ఆర్పీలపై కేసులు నమోదు చేశారు. రామన్నపేట, వలిగొండ మండలాల్లో సెర్ఫ్ పరిధిలో రెండు సంఘాలను సృష్టించి రూ. 65 లక్షలు లోన్లు తీసుకున్నట్టు తేలింది. ఇద్దరు వీవోలను తొలగించడంతో పాటు వారి నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేశారు.
ఆర్పీల్లో ఆందోళన
సంఘాల వివరాలను ఆఫీసర్లు పరిశీలించడంతో రిసోర్స్ పర్సన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు ఆర్పీలు మెక్రో క్రెడిట్ ప్లాన్ (ఎంసీపీ) లేకుండానే లోన్లు ఇప్పించినట్టుగా తెలుస్తోంది. మరికొందరు తక్కువ మెంబర్లు ఉన్న సంఘాల్లో ఇతరుల ఆధార్ కార్డులను చేర్చి పది మంది ఉన్నట్టుగా చూపించినట్టుగా తెలుస్తోంది. ఆఫీసర్లు విచారణలో తేలితే ఎలా? అని ఆర్పీలు ఆందోళన చెందుతున్నారు.
32 వేల మంది ఆధార్ కార్డులు చెకింగ్
ఫేక్ సంఘాలను సృష్టించి లోన్లు తీసుకున్న విషయం బయటకు రాగానే ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ముందుగా మెప్మా పరిధిలోని ఆరు మున్సిపాలిటీల్లో 3,440 సంఘాల్లో ఫేక్ సంఘాలు ఎన్ని? మెంబర్లు ఉన్నారా? అని ఆ సంఘాల్లోని 32, 757 సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్స్ చెక్ చేస్తున్నారు.
సంఘాల పొదుపు ఖాతా అకౌంట్, అప్పు అకౌంట్స్ బుక్స్‌ను కూడా చెక్ చేస్తున్నారు. వీటితో పాటు సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఇచ్చిన లోన్లు, స్త్రీనిధి ద్వారా అందించిన లోన్ల వివరాలను తీసుకుంటున్నారు. ఇచ్చిన లోన్లు మైక్రో క్రెడిట్ ప్లాన్ (ఎంసీపీ) తీసుకొని అందించారా? సభ్యుల అకౌంట్లో వేశారా? సంఘం అకౌంట్లో వేశారా? అనే వివరాలతో పాటు ప్రతినెలా లోన్లకు సంబంధించిన కిస్తులు జమ చేసిన వివరాలు తీసుకొని ఆడిట్ నిర్వహణ ప్రారంభించారు. నకిలీ సంఘాలు అని తేలిన పక్షంలో ఆ సంఘం ఎక్కడ ఏర్పాటు చేశారో గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. అక్రమంగా లోన్లు తీసుకున్నట్టు తేలితే ఆర్పీలపై నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
