55 లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు

55 లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు
  • 42 లక్షల ఎకరాల్లో సాగైన వరి
  • రెండో స్థానంలో మొక్కజొన్న
  • సాగులో నిజామాబాద్‌ టాప్‌
  • రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సాగు 55 లక్షల ఎకరాలు దాటింది. యాసంగి పంటల సాధారణ సాగు 54.93 లక్షల ఎకరాలు కాగా.. రాష్ట్ర రైతాంగం ఇప్పటికే దానిని దాటేశారు. దీంతో ఈ సారి యాసంగి సాగు 101.78 శాతం నమోదైంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో వరి తరువాత మొక్కజొన్న పంటే ఎక్కువ వేసినట్లు రిపోర్టు ద్వారా స్పష్టమైంది. యాసంగిలో రైతులు 42 లక్షల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. వరి సాధారణ సాగు 40.50 లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఇదే టైమ్‌కు 48.05 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈయేడు నిరుటి కంటే వరి తక్కువే సాగైంది. ఈ సీజన్‌లో వరి తరువాత మక్కలు 5.64 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. జొన్నలు 1.89 లక్షల ఎకరాల్లో, పప్పుశనగ 2.53 లక్షల ఎకరాలు, వేరుశనగ (పల్లీ) 2.04 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు గుర్తించారు.

నిజామాబాద్‌ టాప్‌

యాసంగి సాగులో అన్ని పంటలు కలిపి నిజామాబాద్‌ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 4.83 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఆ తరువాత  నల్గొండ జిల్లాలో 4.33 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. సూర్యాపేట జిల్లాలో 3.78 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 3.56 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4.10 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిజామాబాద్‌ జిల్లాలో 3.93 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, సూర్యాపేట జిల్లాలో 3.76లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3లక్షల ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో 2.41లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 2.06 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.