తెలంగాణలో రెండు రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • వర్షాల ప్రభావంతో టెంపరేచర్లు తగ్గే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఏడు జిల్లాలు, సోమవారం మూడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో.. సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే వర్షాలు పడుతాయని తెలిపింది. కాగా, శనివారం ములుగు, కరీంనగర్​, నల్గొండ, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. ములుగు జిల్లా మంగపేటలో 1.3 సెంటీమీటర్ల వర్షం పడింది.

రాష్ట్రంలో పెరుగుతున్న వేడి

రాష్ట్రంలో వేడి పెరిగిపోతున్నది. సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జనగామ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్​లో అత్యధికంగా 38.7 డిగ్రీలు,  వనపర్తి, సూర్యాపేటల్లో 38.3 డిగ్రీలు, పెద్దపల్లిలో 38.2 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్​నగర్ జిల్లాల్లో 38 డిగ్రీలు, జోగులాంబ గద్వాల్​లో 37.7, నాగర్​కర్నూల్​లో 37.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మంలలో 37.3, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలలో 37.2, జగిత్యాల, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 37.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. వర్షాల ప్రభావంతో టెంపరేచర్లు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.