V6 News

మహిళా కోటా బిల్లును చంపిందే నువ్వు.. ప్రధాని మోడీపై ఖర్గే ఫైర్

మహిళా కోటా బిల్లును చంపిందే నువ్వు.. ప్రధాని మోడీపై ఖర్గే ఫైర్

కూచ్ బెహార్: మహిళా కోటా బిల్లును చంపిందే ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే అన్నారు. తాము డీలిమిటేషన్  బిల్లును మాత్రమే వ్యతిరేకించామని, మహిళా కోటా బిల్లును కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బెంగాల్​లోని కూచ్ బెహార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీపై ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

‘‘బెంగాల్  ఎన్నికల ర్యాలీలో మోదీ చాలా సీరియస్ గా పాల్గొంటున్నారు. ఆయన బెంగాల్​కు సీఎం కావాలనుకుంటున్నారా..? ప్రధానిగా కొనసాగాలని లేదా..?” అని ఎద్దేవా చేశారు. యూపీఏ 2 హయాంలో 2010లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్  బిల్లును ఆమోదించామని గుర్తుచేశారు. మహిళా హక్కులుకాపాడేందుకు  తమ పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. 

‘‘కాంగ్రెస్  పార్టీలో సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలు ఉన్నారు. వారు కాంగ్రెస్ కు అధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీలో ఎవరైనా అలాంటి మహిళలు ఉన్నారా? ఎవరైనా మహిళను జాతీయ అధ్యక్షురాలిగా ప్రమోట్  చేశారా..? అలాగే 2023లో మహిళా కోటా బిల్లుకు మేము మద్దతు ఇచ్చాం. కానీ, మోదీ 30 నెలల పాటు పడుకుని ఇప్పుడు బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిద్ర లేచారు. ఇన్ని నెలల పాటు బిల్లును ముందుకు తీసుకెళ్లకుండా ఎవరు ఆపారు” అని ఖర్గే ప్రశ్నించారు.

మహిళా కోటా బిల్లు పేరుతో నాటకాలా..?

మహిళా కోటా బిల్లు పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్  బిల్లు తెచ్చి నాటకాలు ఆడుతోందని మల్లికార్జున్  ఖర్గే విమర్శించారు. ‘‘డీలిమిటేషన్  బిల్లును ఆదరాబాదరాగా పాస్ చేసి జనరల్  ఎలక్షన్ కు పోదామనుకుంటున్నారు. 

ప్రజస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచి మహిళా సాధికారత అంటారా..? మోదీ 2014లో ప్రధాని అయ్యారు. అంతకుముందే మహిళలకు ఓటు హక్కు ఉంది. మోదీ చేస్తున్న ప్రచారంతో వివిధ మతాల మధ్య సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. బెంగాల్  ప్రజల ముందు ఆయన పప్పులు ఉడకవు” అని ఖర్గే వ్యాఖ్యానించారు.