యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ హవా..ఒకేసారి 11 మంది స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్‌‌‌‌ ఉద్యోగాలు

యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ హవా..ఒకేసారి 11 మంది స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్‌‌‌‌ ఉద్యోగాలు

హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. వర్సిటీలో డేటా సైన్స్ మేనేజ్‌‌‌‌మెంట్ కోర్సు పూర్తి చేసిన మొత్తం 14 మంది విద్యార్థు్ల్లో..ఏకంగా 11 మంది మైక్రోసాఫ్ట్ క్యాంపస్ సెలక్షన్‌‌‌‌లో ఎంపికయ్యారు. ఎంపికైన ఈ ప్రతిభావంతులకు ఏడాదికి రూ.7 లక్షల చొప్పున ఆకర్షణీయమైన వార్షిక ప్యాకేజీలతో కూడిన నియామక పత్రాలను సంస్థ ప్రతినిధులు అందజేశారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం వల్లే మొదటి బ్యాచ్‌‌‌‌లోనే అరుదైన విజయం సాధ్యమైందని వర్సిటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కేవలం థియరీ క్లాసులకే పరిమితం కాకుండా ఆధునిక మార్కెట్ అవసరాలను గుర్తించి నైపుణ్యాలను అందించడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని, ఇది తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడారు.

ఒకేసారి 11 మంది విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో అటు తల్లిదండ్రులలో, ఇటు యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. మిగిలిన విద్యార్థులకు కూడా ఇది ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలను క్యాంపస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఆహ్వానించి, మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.