ప్రేమించిన యువతి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్

 ప్రేమించిన యువతి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్
  • బీరు బాటిల్ తో తలపై మోదుకుంటూ బెదిరింపులు

వికారాబాద్: ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ బాటిల్ తో తలపై మోదుకుంటూ బెదిరింపులకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడు ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిన గజ్వేల్ కు చెందిన (20) ఏళ్ల యువతీతో ప్రేమలో పడ్డాడు. తాజాగా రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని యువతి ని ఏకంగా తన ఇంటికె తీసుకువచ్చాడు. 
అయితే యువకుడి కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చాక ఇరు కుటుంబాలు మాట్లాడుకుని యువతిని కుటుంబ సభ్యులతో వెనక్కి పంపించారు. అయితే ఆ యువతి తనకి దక్కదేమో అనుకున్న వినోద్ మద్యం సేవిస్తూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం బాటిల్ తో రక్తం వచ్చేలా తలపై మోదుకుంటు బెదిరింపులకు దిగాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఎస్సై రాజు చేరుకొని ఆ యువకున్ని బుజ్జగించి వాటర్ ట్యాంక్ పై నుండి దించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.