కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. లేదంటే కేసీఆర్‌ను గాంధీలో చేర్చండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. లేదంటే కేసీఆర్‌ను గాంధీలో చేర్చండి
  • గాంధీ ఆస్పత్రి ముందు ప్లకార్డుతో యువకుడి నిరసన

హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. లేదంటే కేసీఆర్‌ను గాంధీలో చేర్చండి అంటూ గాంధీ ఆస్పత్రి ముందు ప్లకార్డుతో ఒక యువకుడు నిరసనకు దిగాడు. కరీంనగర్ కి చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ వైద్య చికిత్స దైవాధీనంగా మారడాన్నిభరించలేక ఒక్కడే ధైర్యంగా నిరసన చేపట్టి ప్రభుత్వంలో.. అధికారుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స దైవాధీనంగా మారిందని.. ఒకవేళ ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే.. నిలువుదోపిడీ చేస్తూ.. ఫీజు కట్టడంలో ఏ మాత్రం ఆలస్యమైనా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసి ప్రాణాలు తీస్తున్నారని శ్యామ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో చికిత్స కోసం బాధితులు నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోతోందని... మరో వైపు  ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకునే దిక్కులేక... ఒక వేళ ఉన్నా.. చికిత్స చేసి వేళకు మందులిస్తూ నయం చేయాల్సిన వారే కరువయ్యారని వాపోయాడు. పేదలు చికిత్సకు నోచుకోక చనిపోకూడదని ప్రభుత్వం భావిస్తే.. వెంటనే కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి.. లేదంటే సీఎం  కేసీఆర్ మరియు మంత్రి  కేటీఆర్ లను  గాంధీ ఆస్పత్రిలో చేర్చాలంటున్నాడు. ఎందుకంటే గాంధీ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక.. ఇక్కడ పట్టించుకోకవడం లేదని కొంత మంది ప్రాణం మీద ఆశతో ప్రయివేటు హాస్పిటల్ లో చేర్పించి  అప్పుల పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలే మా దేవుళ్లు.. ప్రజల కోసమే మేము.. ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పే రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి చోద్యం చూస్తుండడం బాధాకరమని.. దీన్ని ఖండిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం  కరోనా రోగాన్ని వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చండి లేదా సీఎం  కెసిఆర్ మరియు కేటీఆర్ లను  గాంధీ లో చేర్చండి అని డిమాండ్ చేశారు.