తెలంగాణలో భారీగా పెరిగిన యువ ఓటర్లు

తెలంగాణలో భారీగా పెరిగిన యువ ఓటర్లు


ఫస్ట్ టైమ్ ఓటేసేటోళ్లు 8 లక్షలు 
అన్ని పార్టీల ఫోకస్ యూత్ పైనే

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేస్థాయిలో యువత ఓటు బ్యాంకు భారీగా పెరగడంతో అన్ని పార్టీలూ యూత్ పై ఫోకస్ పెట్టాయి. యువతకు దగ్గరయ్యేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి.  ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 18 నుంచి 39 ఏండ్లలోపు వాళ్లు1,60,07,252 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీళ్లే 30 శాతం వరకూ ఉండటంతో యూత్ ఓట్లు సంపాదిస్తే దాదాపు విజయం ఖరారు అయినట్లే అని పార్టీలు భావిస్తున్నాయి. వినాయక చవితి, దేవీ నవరాత్రుల సందర్భంగా విగ్రహాలను ఇప్పించారు. కల్చరల్ ప్రొ గ్రాములకు స్పాన్సర్ చేయడం, విగ్రహాల నిమజ్జనానికి వాహనాలను సమకూర్చడం వంటివి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో యువతకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడంతో పాటు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 

సోషల్ మీడియా ద్వారా గాలం 

కరోనా తర్వాత  సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడియా యాప్ వాడుతున్నారు. యువత ప్రధానంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ లలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో పార్టీల ఐటీ సెల్ టీమ్ లు కూడా ఆయా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాయి. రీల్స్, డీజే పాటలు, పొలిటికల్ మీమ్స్, ట్రోల్ వీడియోలతో ప్రత్యర్థి పార్టీలను 
ఎండగడ్తున్నాయి.     

కీలకంగా నిరుద్యోగులు  

టీఎస్ పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపు 28 లక్షల మంది ఉన్నారు. వరుసగా పరీక్షల రద్దులు, వాయిదాలు.. ఫలితాల ఆలస్యాలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనిని ఆసరా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు వారికి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులను ఆకట్టుకునేలా ఇతర ప్రధాన హామీలను ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా నిరుద్యోగ భృతి, పరీక్షల నిర్వహణ, టీఎస్ పీఎస్సీ తీరు, పరీక్షల వాయిదాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ దీటుగా ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బీఎస్పీ తన మేనిఫెస్టోలో ఐదేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిరుద్యోగుల విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీ గురించి కానీ, ఇతర అంశాల గురించి ప్రస్తావన లేకపోవడమే అందుకు నిదర్శనం. 

ఉద్యోగాల భర్తీ హామీ ఇచ్చినోళ్లకే ఓటు  

తెలంగాణ ఏర్పడ్డాక పదేండ్ల తర్వాత ఇచ్చిన గ్రూప్ 1 పరీక్షలను సక్రమంగా నిర్వహించ లేక పోయారు. మన పక్కనున్న ఏపీ ప్రభు త్వం 3 సార్లు గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసింది. నాలుగో సారి గ్రూప్ 1 నోటిఫికే షన్ వేసేందుకు రెడీగా ఉంది. ఇక్కడమాత్రం రక రకాల కారణాలతో పరీక్షలు, ఫలితాలు వాయిదా పడుతున్నాయి. ఇంకా ఎన్నేండ్లు మేం ప్రిపేర్ కావాలి? ఉద్యోగాలను సమర్థం గా భర్తీ చేస్తామని హామీ ఇచ్చేవారికే ఓటేస్తాం. 
‑ చంద్రశేఖర్, నిరుద్యోగి