ఏ తల్లి కన్నదో.. ఏడ పుట్టిండో తెలియదు!
కండ్ల ముందు విశాల ప్రపంచం ఉన్నా..
ఏ దిక్కూ మొక్కు లేని అనాథగా ఎదిగిండు!
బడి ఎర్కలేదు.. అక్షరాలు దిద్దిందీ లేదు! పాలుగారే వయసులో పశులకాపరిగా మారిండు.
చెట్లు, పుట్టలతో సోపతి గట్టిండు! చేను చెల్కలతో ముచ్చటపెట్టిండు!
ఏడ తిన్నడో.. ఏడ పన్నడో..
ఖుద్దు తనకే తెలియదు!
పశులకాపరి నుంచి తాపీమేస్త్రిగా మారిండు.. అడ్డాల మీద నిలవడ్డడు!
ఊరూరూ తిరిగిండు.. చెమట చిందించి తనకు
నీడనియ్యని ఎన్నో సౌధాలను కట్టిండు!
ఆ తొవ్వొంటే ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించి.. అందె
ఎల్లన్న అందెశ్రీ అయిండు. తెలంగాణ జాతి
జయకేతనమయ్యిండు. ‘జయ జయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ తల్లికి అక్షరమాలలు అల్లి.. రాష్ట్రగీతాన్ని అందించిండు..!
ఆయన లోకం చెక్కిన కవి, లోకాన్ని చెక్కిన కవి! లోక కవి!!
జన జాతరను వదిలి.. తరలిరాని లోకాలకు
తరలిపోయిండు!!పల్లెను పాటగట్టి..!
పశులకాపరిగా, తాపీమేస్త్రిగా ఊరూరు తిరుగుతూ.. నిజామాబాద్‌లోని శంకర్‌మహరాజ్ వాస్రం (ఆశ్రమం)లో అందెశ్రీగా మారిండు అందె ఎల్లన్న. ప్రకృతి ఒడిలో పుట్టిపెరిగిన ఆ కర్మయోగిలోని పాటను పసిగట్టిన శంకర్ మహరాజే ‘అందెశ్రీ’ అని నామకరణం చేసిండు. లోకాన్ని చెప్పిండు.. ప్రపంచాన్ని చూపెట్టిండు. అక్కడి నుంచి బయలుదేరిన అందెశ్రీ.. తెలంగాణ ఉద్యమానికి పాటైండు! తెలుగు సినిమాకు జనగీతమైండు!! బువ్వపెట్టినోళ్లను మర్వలేదు.. తొవ్వచూపినోళ్లను ఇడ్సిపెట్టలేదు! ‘‘నా తలరాతను రాసింది.. శంకర్ మహరాజే’’ అని గురుభక్తిని చాటిచెప్తుండె! ‘‘పల్లె నీకు వందనాలమ్మ.. ననుగన్నా పల్లె..’’ అంటూ తను తిరిగిన పల్లెలను కైగట్టిండు. ‘‘సూడా సక్కాని తల్లీ.. సుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగామల్లి.. నాపల్లె పాలవెల్లి .. మళ్లీ జన్మంటూ ఉంటే సూరమ్మో.... తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా..” అంటూ అనాథనైన తనను చేరదీసిన ఓ అమ్మకు అక్షర రూపమిచ్చిండు. ‘‘కొమ్మ చెక్కితె బొమ్మరా.. కొలిచి మొక్కితె అమ్మరా..” అంటూ తను సోపతిగట్టిన ప్రకృతిని పాటలో కొలిచిండు. ‘‘మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు.”అంటూ మనుషులుండీ మనసులు లేని లోకాన్ని నిలదీసిండు. ‘‘సినుకమ్మా.. వాన సినుకమ్మ.. నేల సిన్నబోయె సూడు బతుకమ్మ. మేఘాల దాగుండిపోకమ్మ.. ఆగమేఘాల మీద రావమ్మ” అంటూ నేల తల్లి గోసను మేఘాలలోని చినుకమ్మకు చేరవేసిండు. అందెశ్రీ రాసిన ప్రతి పాట ప్రకృతి చుట్టూ, జనం చుట్టే తిరిగింది!
పదేండ్లు కడుపులో పాటను మోసి....!
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటల తూటా అయిండు. తెలంగాణ కోసం ఎక్కడ, ఎవరు వేదిక ఏర్పాటు చేసినా.. ముందుంటుండె. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటుతుండె. తను పాటపాడుతుంటే.. ఏ మైకూ అవసరం లేదు. ఆ గొంతే.. నలుదిక్కులా ప్రతిధ్వనించేది. మలిదశ ఉద్యమపోరులో ‘ధూం ధాం’ ఆయనే! ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థి గర్జనా ఆయనే! సింగరేణి జంగుసైరనూ ఆయనే! సాగరహారంలోనూ ఆయన గళగర్జనే!! ఉద్యమ సమయంలో వేదికలపైనే కాదు.. ప్రతి బడిలో అందెశ్రీ పాట మార్మోగేది. ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ ఒక ప్రార్థనా గీతమై పోరాటాన్ని ముందుకు నడిపింది. స్వరాష్ట్రంలో ఆ పాట రాష్ట్ర గీతమవుతుందనీ అందరూ ఆకాంక్షించారు. స్వరాష్ట్రం వచ్చింది. కానీ, పాట అక్కడే ఆగిపోయింది! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేండ్లు! ఏ కవి అయినా, రచయిత అయినా పాట రాయడానికైనా పురిటినొప్పులు పడ్తడు.. ప్రసవ వేదనను అనుభవిస్తడు.. ఆ పాట బయటికి వచ్చినంక బాలింతలెక్క సంబురపడిపోతడు. రాష్ట్ర గీతం అవుతుందనుకున్న ‘‘జయ జయహే తెలంగాణ’’ పాట.. అక్కడే ఆగిపోవడంతో అందెశ్రీ ఎంత వేదన అనుభవించిండో..!? ఆ వేదనను పదేండ్లు కడుపులో మోసిండు! ‘‘ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ? కండ్లు దెరిసిన పసికూన మొదలు.. కాటికి కాళ్లు చాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతేనే కదా వచ్చింది తెలంగాణ. అరే! నైజామోని పైజామూడగొట్టింది.. రజాకారు మూకలను దిగంతాలకు తరిమికొట్టింది.. గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరీకట్టింది నా తెలంగాణ. తెలంగాణమంటే.. పిడికెడు మట్టారా? పిపిలీకాది బ్రహ్మపర్యంతం కంపరం బుట్టించే మందు పాతర!” అని ‘నిప్పులవాగు’గా గర్జించిండు. ఆ గర్జనకు సర్కారు మారింది. కొత్త సర్కార్ కొలువు దీరినంక ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతమైంది. 2024 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన ఆ పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతుంటే.. అందెశ్రీ చేసిన నినాదం బిడ్డను కన్నంక తల్లిపడే సంబురంలెక్క కనిపించింది. ఆ సన్నివేశం కఠినాత్ములకైనా కన్నీళ్లు తెప్పించింది.
ఓయూలోని ఏ కొమ్మను అడిగినా..!
పల్లెను విడిచి కుటుంబంతో పాటను పట్టుకొని పట్నం వచ్చిన అందెశ్రీకి ఉస్మానియా యూనివర్సిటీ అమ్మ అయింది. నమ్ముకున్న ఆ బిడ్డను లాలించింది.. జోలపాడింది. ఎన్సీసీ గేట్ నుంచి మొదలుపెడ్తే.. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ వరకు ఏ కొమ్మను అడిగినా.. ఏ రెమ్మను అడిగినా అందెశ్రీ గురించే చెప్తది. ‘‘అందెశ్రీ ఎక్కడుంటడు’’ అని ఎవరైనా అడిగితే.. ‘‘ఓయూలోని త్రివేణి హాస్టల్లోనో .. ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లోనో.. లాన్స్ కేఫ్ దగ్గర్నో.. ఆర్ట్స్ కాలేజీ ముందటనో ఉంటడు” అని చెప్తుండె! పొద్దున లేవగానే.. ఓయూలో వాలిపోతుండె. ఆ కొమ్మలు, రెమ్మల నడుమ.. ఓయూ స్టూడెంట్ల పలకరింతల నడుమ.. పాటలను కైగట్టెటోడు. అందెశ్రీ పాట రాయడానికి ఓయూనే వేదికైంది.. ఆయన రాసిన పాటల్లో ఎక్కువ శాతం అక్కడి పరిసరాల్లో తిరుగుతూ రాసినవే ఉంటయ్! 30 ఏండ్ల నుంచి ఉస్మానియా గడ్డతో అందెశ్రీకి అనుబంధం. అక్కడ ఏ స్టూడెంట్ను అడిగినా.. పూర్వ విద్యార్థులను పలకరించినా.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని యాదిజేస్కుంటరు.
కులాతీతుడు.. కాలాతీతుడు
కళాకారులైనా, ఉద్యమకారులైనా, విద్యార్థులైనా అందెశ్రీని ‘అన్న’ అని ఆత్మీయంగా పిలుచుకునేవారు. ‘‘అన్నా నువ్వు మా కులపోడివి.. మాకు సపోర్ట్ చేయాలి’’ అని ఎవరన్నా అంటే.. ‘‘తమ్మీ! నేను ఏడ పుట్టిన్నో.. ఎవలకు పుట్టిన్నో నాకే తెల్వదు. నాకు కులమేంది తమ్మీ! నాది ఏ కులమూ కాదు.. అన్నికులాలు నాయే! అందరూ నావోళ్లే’’ అంటుండె. కులం కార్డుతో సాహిత్య లోకాన్ని ఏలే ‘పండితపుత్రుల’ తీరును సహించేవాడు కాదు. ‘‘వాగ్గేయకారుడు అందెశ్రీ.. ఆయనకు జానపదం తప్ప మనలెక్క రాయరాదు. ఆయన కవి ఎట్లయితడు’’ అనే సాహితీ పండితపుత్రరత్నాలను ఎండగడుతూ.. పద్యాలు రాసిండు.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ ఎలుగెత్తిచాటిండు. ఆయన కులాతీతుడు.. కాలాతీతుడు. బడికెళ్లి చదువుకోకపోయినా.. పలకాబలపం పట్టి ఓనమాలు దిద్దకపోయినా.. లోకాన్ని చదివిండు..! లోకకవిగా మారిండు. ‘‘ఒక్క అడుగే కదా.. ఒడువని తొవ్వలను సృష్టించింది! ఒక్క నడుగే కదా.. విశ్వాంతరాలకు సైతం వినిపించింది! ఒక్క చినుకే కదా.. సప్తసముద్రాలను కనిపెంచింది! ఒక్క ఆలోచనే కదా.. సమస్త ప్రపంచాన్ని నిర్మించింది! ఒక్క చూపే కదా.. భూనభోంతరాళను దర్శించింది!” అంటడు అందెశ్రీ. ఆయన పాట అమరం.. ఆయన బాట అజరామరం!!
కష్టాల కడలిలో పాటతో పయనం
కష్టాలు, కన్నీళ్లు సహజం. కానీ, అందెశ్రీది పుట్టుకతోనే కష్టాల బాట! అయినా.. ఏనాడూ తలవంచలేదు. చేతిలో చిల్లిగవ్వలేకుండా పాటనే నమ్ముకొని హైదరాబాద్ వచ్చిండు. ఎక్కడ తిన్నడో.. ఏడ ఉన్నడో ఆయనకే తెలియదు. కన్న కొడుకు మంచాన పడితే.. దవాఖాన్లో చూపించలేని దుస్థితిని ఎదుర్కొన్నడు. కండ్ల ముందే కొడుకు కన్నుమూస్తే ఆ శోకాన్ని దిగమింగుకున్నడు. పాటను నమ్ముకొని ముందుకు నడిచిండు.
రాజ్యసభలో తెలం‘గానం’ చేయాలనీ..!
స్వరాష్ట్రం ఏర్పడినంక దాదాపు పదేండ్లు అందెశ్రీ ఏ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు.. ఇవ్వలేదు కూడా! తనేందో.. తనపనేందో చేసుకుంటూ పోయేది! ఎప్పుడూ ఓయూ చెట్లు, పుట్టల నడుమ.. కొమ్మలు, రెమ్మల చుట్టే తిరుగుతుండె. కొందరి సహకారంతో అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి నదులపై దీర్ఘకవిత్వం రాయడానికి నదుల చుట్టూ తిరుగుతుండె. ఏదో ఒకరోజు ‘జయజయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతమవుతుందని బలంగా నమ్ముతుండే! అది ప్రజల పాట కాబట్టి.. అయితీరుతుందని చెప్తుండె! రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. చేసి చూపెట్టారు. అధికారికంగా రాష్ట్రగీతాన్ని చేశారు. రాష్ట్రగీతాన్ని అందించిన అందెశ్రీకి రాజ్యసభలో ఆ పాట ఆలపించాలనే కోరిక ఉండేది. నాలుగేండ్ల కింద ఓ సారి మాటముచ్చట్లో ఇదే విషయాన్ని చెప్పిండు. ‘‘ఎట్లయిన తమ్మీ.. ఎప్పుడో ఒకప్పుడు.. నేను పోయేలోపు. రాజ్యసభలో జయజయహే తెలంగాణ గీతాన్ని పాడాలని ఉంది! తెలంగాణ రాష్ట్ర సమరాంగణంలో ప్రాణాలు పణంగా పెట్టిన అమరుల గాథను ఆ వేదికపై చెప్పాలని ఉంది. ఆ కుటుంబాల గురించి మాట్లాడాలని ఉంది!” అన్నడు.
- అంబట్ల రవి
సీనియర్ జర్నలిస్ట్
