ఒకప్పుడు బాల్య వివాహాలు కామన్ గా జరిగేవి. అయితే.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సామజిక ఉద్యమాలు వెల్లువెత్తడం.. ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించడం, జనాల్లో అవగాహన పెరగడంతో బాల్యవివాహాలు దాదాపు ఆగిపోయాయని చెప్పాలి. అయితే.. అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట బాల్య వివాహాన్ని స్థానికులు, అధికారులు అడ్డుకున్నారంటూ వార్తలు వింటుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బాలాజీ కాలనీలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు ఐసీడీఎస్ అధికారులు. సోమవారం ( నవంబర్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
తంబళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇనుకొండ లక్ష్మణ్,రాజేశ్వరి దంపతుల కుమారుడుతో ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచ గ్రామం, వేములవాడకు చెందిన మేకల రమేష్, సమ్మవ్వల కుమార్తెతో ఈరోజు వివాహం నిశ్చయించారు పెద్దలు. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. పెళ్ళికి వచ్చిన బంధువులు, అతిదులతో ఫంక్షన్ హాల్ కిటకిటలాడుతోంది. మరికొద్దిసేపట్లో పెళ్లి జరగనుండగా... పెళ్లికూతురు మైనర్ అంటూ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి.
►ALSO READ | మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్..
ఫిర్యాదు అందుకున్న అధికారులు వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి వివాహం జరగకుండా ఫంక్షన్ హాల్ కు తాళం వేయించారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, సౌజన్య, చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ స్రవంతి వరుడు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించి పెళ్లిని ఆపేశారు. మండలంలో ప్రతి గ్రామానికి వెళ్లి బాల్య వివాహాలపై అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు అధికారులు.
