- కాంగ్రెస్ వైపు ముగ్గురు ఇండిపెండెంట్లు
- ప్రధాన పార్టీల కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపులు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 49 వార్డులకుగాను ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ‘ఎవరు ఎవరితో జత కడతారు?’ అన్న చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ 19 వార్డులు గెలుచుకోగా, బీజేపీ 16, బీఆర్ఎస్11, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో విజయం సాధించారు.
ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపడంతో పార్టీ బలం 22కు చేరింది. చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 25 కావాలి. అంటే ఇంకా ముగ్గురు సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది.
దక్కని ఎక్స్ అఫీషియో ఓటు..
కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే లేరు. కామారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎంపీ కాంగ్రెస్‌కు చెందినవారే అయినప్పటికీ, స్థానికంగా ఓటరుగా నమోదై ఉండాల్సిన నిబంధన కారణంగా ఎక్స్-అఫీషియో ఓటు వినియోగించుకోవడం సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
పొత్తులే పరిష్కారమా?
రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రధాన పార్టీలు పరస్పరం బహిరంగంగా పొత్తులు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక లీడర్ల నిర్ణయాలపై పరిస్థితులు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 16న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ రోజున ఎన్నిక జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ శిబిరంలో కీలక చర్చలు..
కాంగ్రెస్ సభ్యులతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమావేశం కానున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికతో పాటు, మిగిలిన ముగ్గురు సభ్యుల మద్దతు ఎలా పొందాలి? ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే పదవుల విషయంలో ఏవైనా డిమాండ్లు ఉంటాయా? వంటి అంశాలపై చర్చించనున్నారు.
చివరికి ఏమి జరగనుంది..
మెజార్టీకి అతి చేరువలో ఉన్న కాంగ్రెస్‌కు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు దక్కుతాయా? లేక చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు మారుతాయా? అన్నది ప్రస్తుతం కామారెడ్డిలో ప్రధాన చర్చగా మారింది.ఈ నెల 16న జరిగే ఎన్నికలతో స్థానిక రాజకీయాలకు స్పష్టత రానుంది.
కౌన్సిలర్లంతా క్యాంపుల్లోనే..
కామారెడ్డిలో హంగ్ వచ్చిన దృష్ట్యా అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లను ఆయా పార్టీల ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి క్యాంపులకు తరలించారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది (ఇండిపెండెంట్లతో కలిపి) సభ్యులను హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో ఉంచారు. బీజేపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను మహారాష్ట్రకు తరలించినట్లు సమాచారం.
బీఆర్ఎస్కు చెందిన11 మంది సభ్యులను హైదరాబాద్ పరిసరాల్లోని రిసార్ట్‌లో ఉంచారు. మున్సిపాలిటీకి చెందిన 49 మంది సభ్యులు వేర్వేరు క్యాంపుల్లో ఉండగా, 16న నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరవుతారని చెబుతున్నారు. శివరాత్రి పండుగను కూడా క్యాంపుల్లోనే నిర్వహించనున్నట్లు సమాచారం.
