కాయగూరలు పండిద్దాం.. వెజిటెబుల్స్ సాగుపై వలంటీర్లుగా 89 మంది రైతుల నియామకం

కాయగూరలు పండిద్దాం.. వెజిటెబుల్స్ సాగుపై వలంటీర్లుగా 89 మంది రైతుల నియామకం
  •     ఇప్పటికే రెండు ఫేజుల్లో ట్రైనింగ్​
  •     ఒక్కో వాలంటీర్​కు 100 ఎకరాల సాగు లక్ష్యం.. వెజిటెబుల్​పంటలపై రైతుల్లో ప్రచారం
  •     వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు డైవర్షన్​ 

నిజామాబాద్​, వెలుగు: ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాలు తక్కువ ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిజామాబాద్​జిల్లా రైతులను కాయగూరల పంటల సాగు వైపు మళ్లించేందుకు​ప్రభుత్వం ప్రయత్నాలు షురూ చేసింది. మొత్తం 545 గ్రామాల నుంచి 89 మంది ఔత్సాహిక రైతులను వలంటీర్లుగా నియమించిన జిల్లా యంత్రాంగం వారితోనే సహచర రైతులను పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నారు.

 కాయగూరలు సాగు చేస్తే ప్రభుత్వం​నుంచి లభించే ప్రోత్సాహకాలు, దిగుబడి లాభాలతోపాటు సాగునీటి కొరతను ఎలా అధిగమించవచ్చో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ట్రైనింగ్​ను వాలంటీర్లకు ఇప్పటికే రెండు దఫాల్లో ఇచ్చారు. ఈ వానాకాలం మరో 2 వేల ఎకరాల ఆయిల్​పామ్​పంట సాగు టార్గెట్​పెట్టుకున్న హార్టికల్చర్​శాఖ ఎంపిక చేసిన 6 మండలాల్లో ప్రచారానికి సిద్ధమైంది.

 తగ్గిన వర్షాలు, కూరగాయల సాగుపై ఫోకస్​

జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. మెజార్టీ రైతులు వరి పండిస్తున్నారు. ఈ యాసంగిలో 4.36 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 54,601 ఎకరాల్లో మొక్కజొన్న, 34 వేల ఎకరాల్లో సోయాబీన్, 1,022 ఎకరాల్లో పత్తి, 832 ఎకరాల్లో కందులు, మరో వంద ఎకరాల్లో పల్లి, మినుము, పెసర్లు, ఆముదం తదితర పంటలు వేశారు. 

వర్షాలు విస్తారంగా ఉన్న సమయంలో వరి సాగు పెద్ద సమస్య కాకపోవచ్చు.. కానీ ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం పంట మార్పడి తప్పనిసరి. కానీ జిల్లాలో కాయగూరల సాగు క్రమంగా తగ్గుతూ 2,946 ఎకరాలకు  పడిపోయింది. చిన్న కమతాలున్న 2,390 రైతులు మాత్రమే వెజిటెబుల్స్​పండిస్తున్నారు. 

తీగ జాతి పంటలకు రూ.50 వేల సబ్సిడీ

డిమాండ్​మేరకు కాయగూరల సాగు లేకపోవడంతో ఈ పరిస్థితిని మార్చేందుకు హార్టికల్చర్​ఆఫీసర్లు నడుం బిగించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో హైరానా పడుతున్న రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. వెజిటెబుల్​సాగుతో లాభాలు పొందుతున్న ఔత్సాహిక రైతులనే వలంటీర్లుగా ఎంచుకున్నారు. తక్కువ నీటి వినియోగంతో రెండు, మూడు నెలల్లోనే  కోతకు వచ్చే కాయగూరల పంటలపై వారికి శిక్షణ ఇచ్చారు.

 బీర, కాకర, దొండ ఇతర తీగ జాతి కాయగూరల సాగు కోసం ఎకరానికి ప్రభుత్వం​ఇస్తున్న రూ.50 వేల సబ్సీడీ, ఇతర పంట రాయితీలపై అవగాహన కల్పించనున్నారు. ఒక్కో వలంటీర్​కనీసం వంద ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయించి జిల్లాలో 9 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచేలా లక్ష్యాలు విధించుకున్నారు. 6,500 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్​పామ్​ను మరో 2 వేల ఎకరాలు పెంచడానికి డొంకేశ్వర్, మాక్లూర్, ముప్కాల్, మెండోరా, సిరికొండ, బాల్కొండ మండలాలను ఎంపిక చేసుకున్నారు. 

రిజల్ట్ చూపిస్తం

లోటు వర్షం సంకేతాలు కనబడుతున్న నేపథ్యంలో పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలి. వలంటీర్లతో వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నం. కూరగాయ పంటలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంది. ఖరీఫ్​లో వెజిలెబుల్​పంటల సాగును గరిష్ట స్థాయికి తీసుకెళ్తం. ఆయిల్​పామ్​సాగును మరింత పెంచుతం.

- శ్రీనివాస్, హార్టికల్చర్ జిల్లా అధికారి, నిజామాబాద్-​