నిధుల కొరత సాకుతో ఏ పథకమూ ఆగరాదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

నిధుల కొరత సాకుతో  ఏ పథకమూ ఆగరాదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ప్రీ బడ్జెట్ సమీక్షలో అధికారులకు మంత్రి వివేక్ ఆదేశం
  •     కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 
  •     యువతకు అడ్వాన్స్‌‌డ్ శిక్షణపై దృష్టి సారించాలని సూచన

హైదరాబాద్, వెలుగు:  కార్మిక సంక్షేమమే ధ్యేయంగా, నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని  కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిధుల కొరత సాకుతో కార్మికులకు అందే బీమా సేవలు గానీ, ఇతర సంక్షేమ పథకాలు గానీ ఎక్కడా నిలిచిపోవడానికి వీల్లేదని  స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన 'ప్రీ-బడ్జెట్' సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించడంతో పాటు అడ్వాన్స్‌‌డ్  టెక్నాలజీ సెంటర్ల  ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలని మంత్రి స్పష్టం చేశారు. ‘‘శిక్షణ నాణ్యంగా ఉంటేనే ప్లేస్‌‌మెంట్స్  పెరుగుతాయి. ఏటీసీల పనితీరు అద్భుతంగా ఉంటే టాటా వంటి దిగ్గజ సంస్థలు మరిన్ని పెట్టుబడులతో ముందుకు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షకులకు (ట్రైనర్లకు) కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు.

వైద్య సేవల్లో రాజీ వద్దు

ఈఎస్ఐసీ  పరిధిలోని బీమాదారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందాలని మంత్రి అధికారులకు తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ఈఎస్ఐ నిధులను రాబట్టేందుకు నిరంతరం ఫాలోఅప్  చేయాలని ఆదేశించారు. ‘‘డబ్బులు లేవని ఏ రోగికీ వైద్యం ఆగిపోవద్దు. బడ్జెట్  అవసరాలపై స్పష్టమైన నివేదిక ఇస్తే.. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రులతో మాట్లాడి నిధుల విడుదలకు స్వయంగా కృషి చేస్తా” అని భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకునే యువత కోసం ‘టామ్ కామ్’  ద్వారా సాగుతున్న నియామకాల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. లక్ష్యాలకు అనుగుణంగా విదేశీ కొలువులు లభించేలా కార్యాచరణ ఉండాలని, ఇప్పటివరకు జరిగిన నియామకాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌‌లో ప్రాధాన్యతలను గుర్తించి పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, ఉపాధి శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

టెక్నాలజీకి తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలి

బషీర్​బాగ్, వెలుగు: అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్  వెంకటస్వామి అన్నారు. యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్స్  ద్వారా తెలంగాణలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆక్స్ ఫర్డ్  గ్రామర్  హైస్కూల్ 45వ వార్షిక దినోత్సవాలు శనివారం హైదరాబాద్​లోని లలిత కళాతోరణంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్  తన సతీమణి సరోజతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45 సంవత్సరాలుగా ఒక విద్యా సంస్థను విజయవంతంగా నడపడం గొప్ప విషయమని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. తాను హైదరాబాద్  పబ్లిక్  స్కూల్ లో చదివానని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. విద్య ఒక శక్తివంతమైన ఆయుధమని, క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి, ఏఐతో పోటీ పడగలిగేలా వారిని తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. కాగా.. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.