సీఎం రేవంత్ కు అగ్రనేతల అభినందనల వెల్లువ

సీఎం  రేవంత్ కు అగ్రనేతల అభినందనల వెల్లువ
  • పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర నేతల కంగ్రాట్స్ 
  • మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంపై ‘ఎక్స్’ వేదికగా విషెస్ 
  • పలు రాష్ట్రాల నుంచీ పార్టీ నేతల ఫోన్లు   
  • ఈ ఫలితాలు కాంగ్రెస్​పై ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం: ఖర్గే
  • సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అభివృద్ధికి మద్దతు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు రేవంత్ రెడ్డికి ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర పరిపాలన, సామాజిక న్యాయం కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని శనివారం ‘ఎక్స్’వేదిగా నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఈ ఘన విజయం కాంగ్రెస్ మోడల్ పరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బలమైన నాయకత్వం, పార్టీతో సమన్వయంతో ఈ ఘన విజయం సాధ్యమైందని ఎంపీ, లోక్‌‌‌‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి విజయ్ వసంత్ తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల ఆమోదానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ పేర్కొన్నారు.  రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ఇటీవలి ఉపఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ సర్కారుకు ప్రజల ఆమోదం: రాహుల్

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమ్మిళిత వృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్‌‌‌‌కు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన ఆమోదముద్ర వేశారని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలియజేశారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ దార్శనికత స్పష్టంగా ఉందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరే లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. 
సుసంపన్న తెలంగాణ నిర్మాణానికి బలం: ప్రియాంక గాంధీ
సుసంపన్నమైన తెలంగాణను నిర్మించాలన్న కాంగ్రెస్ సంకల్పానికి ఈ విజయం మరింత బలాన్ని చేకూరుస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ఈ విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుల నిబద్ధతకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని ఆమె ట్వీట్ చేశారు.

ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం: ఖర్గే

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. 
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు. ‘సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, రాష్ట్ర ప్రజల పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది’ అని ట్వీట్ చేశారు.