- ఇండిపెండెంట్లతో బీజేపీ, కాంగ్రెస్ సంప్రదింపులు
- వైస్ చైర్పర్సన్ ఆఫర్లు చేస్తున్న ఇరు పార్టీలు
- కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోనూ అదే పరిస్థితి
- తాజా రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి
ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. దీంతో రేపు జరుగనున్న మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 49 వార్డులు ఉన్న ఆదిలాబాద్ లో 21 వార్డులు గెలిచి లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీకి చైర్ పర్సన్ పదవి దక్కాలంటే ఇంకా ఐదు ఓట్లు అవసరం. ఎంపీ నగేశ్‌తోపాటు, ఎమ్మెల్యే పాయల్శంకర్ఎక్స్అఫీషియో ఓట్లు కానున్న నేపథ్యంలో ఆ పార్టీకి మరో ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఇండిపెండెంట్లను సంప్రదిస్తూ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేస్తోంది.
కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వారి వార్డులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు 11 స్థానాలు రాగా.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కలాల్ శ్రీనివాస్, బండారి అనూష ఇండిపెండెంట్లుగా గెలిచారు. ఇటు కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే కలాల్ శ్రీనివాస్ ను సంప్రదించగా.. బండారి అనూషతో నియోజక వర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ ఇద్దరు రెబల్స్‌తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లతో చర్చలు జరుపుతున్నారు. తనకు ఓ పార్టీ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చిందని చెబుతున్న కలాల శ్రీనివాస్.. తన వార్డు పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఎవరికి మద్దతివ్వాలో డిసైడ్ అవుతానని వెల్లడిస్తు న్నారు. మిగతా ఇండిపెండెంట్లు సైతం స్పష్టమైన వైఖరిని వెల్లడించడం లేదు.
బీఆర్ఎస్ ఎటు వైపు?
2020 మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న కొడుకు జోగు ప్రేమేందర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే అనూహ్యంగా ఈసారి ప్రేమేందర్ ఓడిపోవడంతోపాటు ఆ పార్టీ కేవలం 6 వార్డులకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో ఏ పార్టీకి మద్దతిస్తుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ మాత్రం బీజేపీకి చైర్ పర్సన్ పీఠం దక్కనివ్వమనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్లతో పాటు 6 వార్డులు గెలిచిన ఎంఐఎం మద్దతు కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఆసిఫాబాద్‌లో ఇండిపెండెంట్లకు గాలం
ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీలకమయ్యారు. 20 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు నలుగురు గెలుపొందారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాంటే 11 మంది కౌన్సిలర్ల మద్ధతు అవసరం. అయితే బీఆర్ఎస్కు ఒక్క ఇండిపెండెంట్ మద్దతిస్తే ఎక్స్ ఆఫీషియో ఓటుతో ఆ పార్టీ గట్టెక్కే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌కు నలుగురి మద్దతు అవసరం. దీంతో రెండు పార్టీల నాయకులు ఇండిపెండెంట్ల ఇండ్ల ముందు మకాం వేశారు. తమకు సపోర్ట్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారనే ఉత్కంఠ నెలకొంది.
ఎవరి లెక్కలు వారివే..
కాగజ్ నగర్ మున్సిపాల్టీ లో రాజకీయం రసవత్తరంగా మారింది. 30 వార్డుల్లో అత్యధికంగా 11 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ మరోసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసి గెలిచిన ఇండిపెండెంట్ వసీం సహా మరొకరి మద్దతు తీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 9 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సైతం పీఠాన్ని దక్కించుకునేలా ఎమ్మెల్సీ దండే విఠల్ ఎత్తులు వేస్తున్నారు.
ఆయన ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టారు. గెలిచిన ఎంఐఎం అభ్యర్థి మద్దతు కూడా లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ ఐదు స్థానాల్లో గెలవడంతో కాగజ్‌నగర్‌లో పార్టీకి కూడా సొంతంగా చైర్పర్సన్ పీఠం దక్కించుకునే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ పరిణామాలు ఎలా మారనున్నాయా అని ప్రజలు ఉత్కంఠతో చూస్తున్నారు.
