బాలీవుడ్ తెరపై నవ్వుల సునామీ సృష్టిస్తూ.. కామెడీకి ఒక పర్యాయపదంగా నిలిచిన నటుడు గోవింద. తనదైన కామిక్ టైమింగ్, అద్భుతమైన డ్యాన్స్, ఫ్యాషన్ సెన్స్ తో ప్రేక్షకులను మైమరిపించిన 'చిచి'గా ఆయన సుపరిచితులు అయ్యారు. బాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించున్న ఆయన చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ స్టార్ హీరో గోవింద భార్య, సునీత అహుజా తమ వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో జన్మలో నా భర్తగా వద్దు..
సూపర్ స్టార్ భార్యగా సునీత తన దీర్ఘకాలిక వివాహం, గోవింద గతంలో చేసిన తప్పులను పంచుకుంటూ తన అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నటుడి భార్యగా ఉండాలంటే ఎంతటి మానసిక ధైర్యం అవసరమో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 'మరో జన్మలో గోవింద నాకు భర్తగా వద్దు' అని ఆమె కుండబద్దలు కొట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరో భార్యగా తాను అనుభవిస్తున్న బాధలను పంచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంచి కొడుకే, కానీ మంచి భర్త కాదు..
వయసు పెరిగే కొద్దీ మనం బాధ్యతలను విస్మరించడం సరికాదు అని సునీత అన్నారు. మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తారు. నేను చేశాను, గోవింద కూడా చేశారు. కానీ ఒక కొంత వయసు వచ్చాక కూడా ఆ తప్పులు చేస్తే, అది మంచిది కాదు. మీకంటూ ఒక అందమైన కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు తప్పులు చేయాలి? మీరు మిమ్మల్ని అదుపులో ఉంచుకోవాలి కదా అంటూ గోవింద గురించి ప్రస్తావిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గోవింద ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు కావచ్చు, కానీ మంచి భర్త మాత్రం కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, మరో జన్మలో ఆయనను తన భాగస్వామిగా కోరుకోనని తేల్చి చెప్పారు.
స్టార్ వైఫ్ గా కష్టాలు
గోవిందతో వైవాహిక జీవితం 1987లో మొదలైంది. 38 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ బంధంలో ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించినట్లు సునీత తెలిపారు. మా ఆయన గోవింద హీరో. నేను ఏం చెప్పగలను? భార్యతో గడిపే సమయం కంటే హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఒక స్టార్ భార్యగా ఉండాలంటే చాలా బలమైన మహిళ కావాలి. మీరు మీ గుండెను రాయిగా మార్చుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి నాకు 38 ఏళ్ల వివాహ జీవితం పట్టింది. యవ్వనంలో నాకు ఈ విషయం అర్థం కాలేదు అని ఆమె తెలిపారు.
గోవింద ఎఫైర్లు...
గోవింద ఎఫైర్ల గురించి గతంలో వచ్చిన వదంతులపై కూడా సునీత స్పందించారు. ఒక మరాఠీ నటితో ఆయనకు సంబంధం ఉందని నేను విన్నాను. కానీ నా సొంత కళ్లతో చూసేంతవరకు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేంతవరకు నేను ఏమీ ప్రకటించలేను, చెప్పలేను కదా అని ఆమె చెప్పారు. గోవింద చేసిన తప్పుల గురించి ఆయనను నేరుగా నిలదీశారా అని అడగ్గా.. సునీత తన మానసిక బలం అంతా తన పిల్లల్లోనే ఉందని, వారికి కుటుంబంలో తన స్థానాన్ని ఇవ్వడం ద్వారానే తాను శక్తిని కూడగట్టుకున్నానని చెప్పారు. బయట కూడా తనకు పెద్దగా స్నేహితులు లేరని, తన పిల్లలే తన ఆత్మీయులని సునీత వివరించారు. అయితే గోవింద గత తప్పులను, వైవాహిక జీవితంలోని కష్టాలను గురించి ఆమె పదేపదే మాట్లాడటం వారి మధ్య ఏదో ఎమోషనల్ గ్యాప్ ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
