ఢిల్లీ పేలుళ్ల ఘటన.. పేలిన i20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో.. సల్మాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. పేలిన i20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో.. సల్మాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక విషయం వెల్లడైంది. పేలిన i20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో ఉందని, సల్మాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉందని దర్యాప్తులో తేలింది. కారు యజమానిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కారును ఓక్లా ఏరియాలో అమ్మేసినట్లు ఆ కారు ఓనర్ పోలీసులకు తెలిపాడు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్ల ఘటనలో 8 మంది మృతి చెందారని, 20 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

నవంబర్ 10, 2025 (సోమవారం) సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో.. ఎర్ర కోట మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దగ్గర ఒక i20 కారు ఆగింది. ఈ కారు ఉన్నట్టుండి పేలడంతో సమీపంలోని వాహనాలకు కూడా మంటలు వ్యాపించాయి. షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ పేలుడు ఘటనలో 8 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫోరెన్సిక్, NIA ఇప్పటికే స్పాట్కు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు.

ఢిల్లీలోని LNJP Hospitalకి 8 మృతదేహాలను తరలించారు. క్షతగాత్రులకు కూడా అదే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఎర్ర కోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్లో మరో 8 వాహనాలు మంటల్లో తగలబడ్డాయి. ఐదారు వాహనాలు పేలిపోయాయి. మంటలు సమీపంలోని దుకాణాలకు వ్యాపించాయి. ఈ పేలుడు దెబ్బకు ఎర్రకోట దగ్గరలో ఉన్న వీధి లైట్లు ఆరిపోయాయి. 

ఢిల్లీ పోలీసులు ఈ బ్లాస్ట్తో అలర్ట్ అయ్యారు. ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్, యూపీలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేలుళ్లు జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. పోలీసులను అడిగి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు.