ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు.. 9 మంది స్పాట్ డెడ్.. ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్‌ !

ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు.. 9 మంది స్పాట్ డెడ్.. ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్‌ !

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో 9 మంది చనిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. పేలుడులో చనిపోయిన వారిలో ఒకరి మృత దేహం పూర్తిగా ఛిద్రమైంది. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని LNJP Hospitalకి 8 మృతదేహాలను తరలించారు. క్షతగాత్రులకు కూడా అదే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.

ఎర్ర కోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్లో మరో 8 వాహనాలు మంటల్లో తగలబడ్డాయి. ఐదారు వాహనాలు పేలిపోయాయి. మంటలు సమీపంలోని దుకాణాలకు వ్యాపించాయి. ఈ పేలుడు దెబ్బకు ఎర్రకోట దగ్గరలో ఉన్న వీధి లైట్లు ఆరిపోయాయి. ఢిల్లీ పోలీసులు ఈ బ్లాస్ట్తో అలర్ట్ అయ్యారు. ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. CNG సిలిండర్ పేలి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కుట్ర కోణం దాగి ఉందేమోననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. NIA కూడా ఈ ఘటనపై విచారణ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఘటనతో ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.