ఇరాన్ క్షిపణి దాడుల, ఉద్రిక్తతల భయంతో దుబాయ్‌లో ఉంటున్న విదేశీయులు నగరాన్ని వదిలి పారిపోతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఇష్టంగా పెంచుకున్న కుక్కలు, పిల్లులను రోడ్లపైనే వదిలేస్తుండటం కలకలం రేపుతోంది.
చాలా మంది వాళ్ళ పెంపుడు కుక్కలను విద్యుత్ స్తంభాలకు కట్టేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు పిల్లులను డబ్బాల్లో పెట్టి, వాటిపై మమ్మల్ని క్షమించండి.. మేము వీటిని తీసుకెళ్లలేము అని రాసి రోడ్ల పక్కన వదిలేస్తున్నారు. కొంతమంది యజమానులైతే వాళ్ళ పెంపుడు జంతువులను వేరే చోటుకి తరలించే ఖర్చు భరించలేక, ఆరోగ్యంగా ఉన్న జంతువులకు విషం ఇచ్చి చంపేయాలని పశువైద్యులను కోరుతుండటం గమనార్హం.
జంతు సంరక్షణ కేంద్రాలు ఇప్పటికే జంతువులతో నిండిపోయాయి. ప్రతిరోజూ వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పరిస్థితి చేయి దాటిపోతోందని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒమన్ సరిహద్దుల ద్వారా వెళ్లిపోవాలని చూస్తున్న వారు, సరిహద్దుల వద్ద జంతువులను అనుమతించకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళ్తున్నారు. ఆహారం, నీరు లేక అవి అక్కడే అలమటిస్తున్నాయి.
దుబాయ్ మున్సిపాలిటీ ఎహ్సాన్ స్టేషన్లు పేరుతో వీధి జంతువులకు ఆహారం అందించే స్మార్ట్ మెషీన్లను ఏర్పాటు చేసింది. కానీ వదిలివేలేన పెంపుడు జంతువులు ఎక్కువగా ఉండటంతో ఇవి సరిపోవడం లేదు. సంపన్న దేశమైన దుబాయ్‌లో ఇలా జంతువులను నడిరోడ్డుపై వదిలేయడం క్షమించరాని నేరం అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
