న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లపై హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. ఐ20 కారులో పేలుడు జరిగిందని, ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు జరిగిందని ఆయన తెలిపారు. పేలుడు ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారని, పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్‌షా వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఢిల్లీ సీపీ సహా ఉన్నతాధికారులతో మాట్లాడానని అమిత్‌షా మీడియాకు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న LNJP హాస్పిటల్ కు అమిత్ షా వెళ్లారు. బాధితులకు ధైర్యం చెప్పారు.
ఇదిలా ఉండగా.. పేలుళ్లకు కారణమైన ఈ ఐ20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో ఉండటం గమనార్హం. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న సిగ్నల్ దగ్గర సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగింది. స్లోగా వచ్చిన ఒక కారు రెడ్‌లైట్ దగ్గర ఆగింది. రెడ్ లైట్ దగ్గర ఆగిన కారులోనే పేలుడు జరిగిందని -ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మీడియాకు తెలిపారు.
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన ఈ పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ పేలుళ్ల కేసులో అనుమానితులుగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
ఈ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా వెల్లడించారు. ఫోరెన్సిక్, NIA ఇప్పటికే స్పాట్కు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు. సల్మాన్ అనే వ్యక్తి పేరుపై ఈ i20 కారు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
