ఇంట్లనే ఉంటరా? ఓటెస్తరా?.. ఎన్నికల రోజు సెలవు ఇస్తున్నా ఓటేయని సిటీ జనం

ఇంట్లనే ఉంటరా? ఓటెస్తరా?..  ఎన్నికల రోజు సెలవు ఇస్తున్నా ఓటేయని సిటీ జనం
  • జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై  
  • భారీ ప్రచారం చేసిన ఈసీ
  • పర్సంటేజీ పెరుగుతుందని ఆశాభావం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఎన్నికల రోజు సెలవు ఇస్తే నగర వాసుల్లో కొందరు ఇంట్లో టీవీ చూస్తూనో, లేక సినిమాలకో వెళ్లి గడుపుతుంటారు. ఓటుకున్న విలువ తెలుసుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉన్నా ఎందుకో ఓటు వేయాలంటే లేజీగా ఫీలవుతారు. ఇయ్యాల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్లు ఎలా స్పందిస్తారోనన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి పర్సంటేజీని పెరిగితే ఎవరికి లాభం జరుగుతుందన్న విషయంపై  కూడా చర్చ జరుగుతోంది.

 ఈసారి ఓటింగ్​పర్సంటేజీ పెంచేందుకు ఎన్నికల కమిషన్​ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో 60 శాతానికి మించి పోలింగ్​జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయాన్ని తొలిసారిగా మరో గంట (రాత్రి 7 గంటల వరకు)పొడిగించారు.

జూబ్లీహిల్స్ గత ఎన్నికల్లో ఇలా....

2009లో నియోజక వర్గాల పునర్విభజన వల్ల అప్పటి వరకూ ఖైరతాబాద్​గా ఉన్న నియోజక వర్గాన్ని విభజించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 52.77 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 50.18 శాతం, 2018లో 45.59 ,  2023లో  48.82 శాతం నమోదైంది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో పురుషులు 2,08,561 , మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది, 1,908 మంది దివ్యాంగ ఓటర్లు, 85 ఏండ్ల పైబడిన వారు 2,134 మంది, 18-–19 ఏండ్ల మధ్య యువ ఓటర్లు 6,859 మంది నమోదయ్యారు.

ఓటింగ్​ పర్సెంటేజ్​ పెంచేందుకు అవగాహన 

2023 సాధారణ ఎన్నికల్లో నమోదైన  పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. 2023లో 48.82 శాతం  పోలింగ్ నమోదు కాగా ఈసారి 70 నుంచి 80 శాతం పోలింగ్​శాతం నమోదయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల శాతం పెరిగిన నేపథ్యంలో ఈసారి పోలింగ్​శాతం కూడా పెరుగుతుందని అధికారులు నమ్మకంతో ఉన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాన్ని, వరుస సంఖ్యను సులభంగా తెలుసుకోవడానికి వీలుగా  ప్రతి ఓటరు ఇంటింటికి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. 

ముఖ్యంగా యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రజలను ఓటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలని చైతన్యపరిచేలా చర్యలు తీసుకున్నారు. పబ్లిక్​ప్లేస్​లు, షాపింగ్​మాల్స్​లో విద్యార్థులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిస్టమేటిక్ ఓటర్స్​ఎడ్యుకేషన్​అండ్​ఎలక్టోరల్​పార్టిసిపేషన్​(స్వీప్) పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. అటు ఉప ఎన్నికలో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అవగాహన కార్యక్రమాల్లో కొన్ని..

ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తు చేస్తూ పార్క్​ల్లో  పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేదీతో కూడిన భారీ అవగాహన బెలూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. నమూనా ఈవీఎంలు, వీవీ పాట్​ల ప్రదర్శనలు, ఓటర్​హెల్ప్​లైన్​లు, ఈ–విజిల్​యాప్​ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించారు. అలాగే వైకుంఠపాళి’ ఆటతో ఓటు ప్రాముఖ్యతను సృజనాత్మకంగా వివరించారు.

 దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని  కాలనీలలో ర్యాలీలు నిర్వహించి  ప్రజలను ఓటు వేసేలా చైతన్యం చేశారు. ఓటు సౌలభ్యంగా వేసేలా వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల అధికారుల ప్రచార కార్యక్రమాలు సరికొత్తగా ఉండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు తెలిపారు.