మహిళా సంఘాల్లో జోష్ నిజామాబాద్ సిటీలో రూ.2 కోట్లతో పెట్రోల్బంక్

మహిళా సంఘాల్లో జోష్ నిజామాబాద్ సిటీలో రూ.2 కోట్లతో పెట్రోల్బంక్
  • రూ.29.10 కోట్లతో విలేజ్​ మహిళా సంఘ భవనాల నిర్మాణం 
  • ఫస్ట్​ ఫేజ్​ కింద 11 మండలాల్లో గోదాంల నిర్మాణం
  • ఫుడ్​  గ్రేయిన్స్​ స్టోరేజీ సమస్య తీర్చడానికి నరేగా ఫండ్స్​ 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ సిటీలో మహిళా సంఘాల కోసం రూ.2 కోట్లతో పెట్రోల్​ బంక్​ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడ్తున్నాయి. అదే రీతిలో జిల్లాలోని మండల కేంద్రాల్లో గోదాంల​ నిర్మాణాల ప్రతిపాదనలు ఫైనల్​ స్టేజ్​కు చేరాయి. ఫస్ట్​ ఫేజ్ కింద 11 మండలాల్లో ల్యాండ్​ ట్రాన్స్​ఫర్​ ఫైల్​పై కలెక్టర్​ సంతకం ముగియగానే పనులు మొదలుకానున్నాయి. 500 టన్నుల కెపాసిటీతో వీటిని నిర్మించడానికి రూ.15 లక్షల చొప్పున ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. రైతులు పంటలు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేసుకోడానికి, మహిళా సంఘాల ట్రైనింగ్​కు ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నారు.

ఏప్రిల్​కు ముందే పనులు స్టార్ట్​ మొదలయ్యేలా ప్లాన్​ చేశారు. సెకండ్​ ఫేజ్​లో మిగిలిన మండలాలు తర్వాత దశలో గ్రామాల వారీగా గోదాంలు నిర్మించే ప్రణాళిక రూపొందించారు. 291 విలేజ్​ల్లో రూ.10 లక్షలతో మహిళా సంఘాల (వీఓ) ఆఫీస్​లను నిర్మించనున్నారు. ఇందుకు రూ.29.10 కోట్లు మంజూరు కాగా  మరో 150 గ్రామాల్లో వీటిని మంజూరు చేయడానికి ప్రపోజల్స్​ రెడీగా ఉన్నాయి. 

పంట దిగుబడుల నిల్వ సమస్య తీర్చడానికి.. 

కాంగ్రెస్​ సర్కార్​ వచ్చాక జిల్లాలో పంటల సాగు మరో 50 వేల ఎకరాలకు పెరిగి మొత్తం విస్తీర్ణం 5.22 లక్షల ఎకరాలకు చేరింది. సన్నాలకు బోనస్​ లభించడంతో రైతులు వరి 4.31 ఎకరాల్లో పండిస్తున్నారు. వడ్ల దిగుబడి అంచనాలు 13 లక్షల టన్నులకు  చేరాయి. దీంతో అన్ని చోట్లా గోదాంల సమస్య నెలకొంది. దీనిని అధిగమించేందుకు స్టేట్​ గవర్నమెంట్​ వినూత్న ఆలోచన చేసింది. రూ.15 లక్షల ఖర్చుతో 500 టన్నుల కెపాసిటీ గోదాంలను ముప్కాల్, నందిపేట, నవీపేట, నిజామాబాద్​ రూరల్, రెంజల్, రుద్రూర్, సిరికొండ, వర్ని, వేల్పూర్, మొపాల్, బాల్కొండలో నిర్మించడానికి సర్కార్​ ల్యాండ్​ గుర్తించారు. కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఒకే చెప్పడంతో పనులు స్పీడ్​గా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గోదాంల బాధ్యతలు నిర్వహించే మహిళా సంఘాలు అద్దె వసూలు చేస్తాయి. 

విలేజ్​ సమాఖ్యకు ఆఫీస్​ 

స్వయం సహాయ సంఘాలకు కాంగ్రెస్​ సర్కార్ రూ.10 లక్షలతో ప్రతీ విలేజ్​లో వీవో ఆఫీస్​ నిర్మించనుంది. జిల్లాలో మొత్తం 545 గ్రామాలుండగా 291 ఆఫీస్​లకు నిధులు శాంక్షన్​ చేశారు. మరో 150 గ్రామాలకు త్వరలో మంజూరు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సిటీ సెంటర్​లో పెట్రోల్​ బంక్​

ఇందూర్​ నగర నడిబొడ్డులో 10 గుంటల స్థలంలో మహిళా సంఘాల కోసం పెట్రోల్​ బంక్​ ఏర్పాటు కానుంది.  ఇటీవల కూల్చేసిన డ్వాక్రా బజార్​ ల్యాండ్​ను దీనికోసం అలాట్​ చేయనున్నారు. ల్యాండ్​ సమస్యతో ఇన్నాళ్లు  బంక్​ నిర్మాణం ఆగింది.

మహిళలకు టాప్​ ప్రయారిటీ

500 గజాల సర్కార్​ ల్యాండ్​ ఎక్కడున్నా 500 టన్నుల గోదాం​మంజూరు చేస్తం.  రైతులకు ఉపయోగపడే గోదాంలు ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. వీఓ ఆఫీస్​ నిర్మాణం మరో గొప్ప మార్పునకు నాందికాబోతున్నది. పెట్రోల్​ బంక్​ ఏర్పాటు ఫైనల్​ స్టేజ్​లో ఉన్నది.- సాయాగౌడ్​, డీఆర్డీవో