- స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున తదుపరి విచారణ అవసరం లేదన్న కోర్టు
- తీర్పు కాపీని శుక్రవారం సాయంత్రంలోపు అప్ లోడ్ చేయాలని ఆదేశం
- నాలుగు రోజుల్లో పిటిషనర్లకు పత్రాలు అందజేయాలని ఆర్డర్స్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టు విచారణను ముగించింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున ఇకపై ఈ వ్యవహారంలో తదుపరి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, స్పీకర్ తీర్పు కాపీని శుక్రవారం సాయంత్రం లోపు అప్ లోడ్ చేయాలని, 4 రోజుల్లో ప్రతివాదులకు సంబంధిత పత్రాలు అందజేయాలని ఆదేశించింది.
ఫిరాయింపులపై గతంలో సీజేఐ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేయగా.. ప్రభుత్వం మరింత సమయం కావాలని కోర్టును కోరింది. ఈ నాలుగు పిటిషన్లను గురువారం జసిస్ట్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్తీన్ జార్జ్ మాసిహ్ ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి హాజరయ్యారు.
తదుపరి విచారణ అవసరం లేదు..
తొలుత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. 10 ఎమ్మెల్యేలపై స్పీకర్ పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, స్పీకర్ ఉత్తర్వు కాపీలను ఇంకా పిటిషనర్లకు అందలేదని బీఆర్ఎస్ తరఫు అడ్వకేట్లు బెంచ్ దృష్టికి తెచ్చారు. స్పీకర్ కార్యాలయం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
టైం బాండ్ తో తమకు స్పీకర్ తీర్పు కాపీలను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలను విన్న ధర్మాసనం.. ఇకపై కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది. అలాగే, శుక్రవారం లోపు అధికారిక సైట్ లో స్పీకర్ తీర్పు కాపీని అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా చట్టానికి లోబడి పిటిషనర్లకు నాలుగు రోజుల్లో సంబంధింత పత్రాలు అందజేయాలని ఆదేశిస్తూ.. ఐదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఫిరాయింపు కేసు నేపథ్యం ఇదీ..
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గతేడాది జనవరి 15న బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ పై కేటీఆర్ రిట్ పిటిషన్ వేశారు.
వీటిపై వాదనలు జరుగుతుండగానే గతేడాది మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో 9 సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జస్టిస్ హోదాలో బీఆర్ గవాయి ముందు నుంచి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టగా.. సీజేఐ గా ఈ ఏడాది జులై 31న కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన నాటి నుంచి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను ఆదేశించారు.
అయితే, స్పీకర్ కార్యాలయం ఈ 3 నెలల కాలం ముగించే సమయానికి మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కోర్టు ధిక్కార పిటిషన్ తో పాటు, మరో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు మిస్ లీనియస్ అప్లికేషన్లు వేశారు. అలాగే, దానంపై మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ ముగించింది.
