బెంగళూరు: లవర్ టార్చర్ తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ తాలూకాలోని జగరావల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకుని వారం గడిచినా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై యువతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగరావల్లి గ్రామానికి చెందిన శోభ, జయరామ్ నాయక్ భార్యాభర్తలు. వీళ్ల కూతురు ప్రియాంక (21) బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ బెంగళూరు నాగసంద్రలోని శివపురలో అద్దె ఇంట్లో ఉండేది. ప్రియాంకకు ఆలూర్ తాలూకాకు చెందిన సుమంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ మూడు నెలలుగా ప్రేమలో ఉన్నారు. చాలా సన్నిహితంగా మెలిగారు. సుమంత్ తన కంటే వయసులో రెండేళ్లు పెద్దవాడు. అయినా పెళ్లి చేసుకునేందుకు ప్రియాంక సిద్ధపడింది.
►ALSO READ | ప్రీ వెడ్డింగ్ షూట్లో కనిపించిన ఈ ప్రేమ.. పెళ్లైన 8 నెలలకు ఎటు పోయిందో.. RIP బ్రో..!
కానీ ఆ యువకుడు ప్రియాంకపై అనుమానంతో ఆమెను వేధించాడు. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. "నువ్వు నాకొద్దు.. చచ్చిపో" అని ఆమెను మానసికంగా సూటిపోటి మాటలతో వేధించాడు. సుమంత్ ప్రవర్తనతో విసిగిపోయిన ప్రియాంక బెంగళూరులో తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆత్మహత్య చేసుకునే ముందు.. సుమంత్ తనను చేసిన టార్చర్ గురించి వివరిస్తూ ఆమె తన మొబైల్ ఫోన్‌లో ఆడియో రికార్డ్ చేసింది. పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులోని పీన్యా పోలీస్ స్టేషన్‌లో సుమంత్పై కేసు నమోదైంది. అతని వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసినప్పటికీ, పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై ప్రియాంక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని ప్రియాంక తల్లిదండ్రులు హెచ్చరించారు.
