హైదరాబాద్: తమ్మిడికుంట పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఐటీ కారిడార్ మాదాపూర్‌లో తమ్మిడికుంట సరికొత్త ఆకర్షణగా మారనుంది. మురుగు నీరు తొలగించి సహజ సరస్సుగా మార్పు చేసే పనులను హైడ్రా భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. ముళ్లపొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. చెరువు విస్తీర్ణం 14 ఎకరాల నుంచి 29 ఎకరాలకు పెరిగింది. చెరువు చుట్టూ పటిష్టమైన బండ్ నిర్మాణం చేస్తున్నారు. ఇన్ లెట్లు, ఔట్ లెట్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. శిల్పారామం వైపు హైడ్రా ఈ చెరువు మెయిన్ గేట్ నిర్మిస్తోంది.
శిల్పారామం దగ్గర వరదనీరు నిలవకుండా ఇన్ లెట్లను అభివృద్ధి చేయాలని హైడ్రా డిసైడ్ అయింది. చెరువు విస్తీర్ణంలో నీరు నిలిచేలా రూపకల్పన చేయాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై చెట్లు నాటే యోచన చేయాలని, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పిల్లల కోసం ఆట స్థలాలు, ఓపెన్ జిమ్‌లు, వృద్ధుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయాలని, ప్రాణ వాయువు అందించే చెట్లతో హరిత వాతావరణం లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు తెలిపారు. తమ్మిడికుంటతో శిల్పారామం ప్రధాన రహదారిపై వరద లేకుండా చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఇప్పటికే మొదటి దశలో రూ.58 కోట్లతో బతుకమ్మ కుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట, సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమృక్ దావాల చెరువుల పునర్నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో బతుకమ్మ కుంట పనులు పూర్తి చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక బుమృక్ దావాల చెరువు, కూకట్‌పల్లి నల్లచెరువు, మాదాపూర్ తమ్మిడి కుంట చెరువు పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. ఈ సుందరీకరణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మిగిలిన ఉప్పల్పెద్ద చెరువు, సున్నం చెరువులను డిసెంబర్ 9 తర్వాత పూర్తి చేయనున్నారు.
