- పోల్ మేనేజ్‌మెంట్‌పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు
- క్షేత్రస్థాయిలో కేడర్‌తో టచ్‌లో ఉండండి
- పోలింగ్ ముగిసేవరకూ అలర్ట్‌గా ఉండండి
- నేను కూడా మీకు అందుబాటులో ఉంట..
- ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే
- ఈసీ, పోలీసులకు కంప్లైంట్ చేయండి
- జూబ్లీహిల్స్ గెలుపుతో పార్టీ, ప్రభుత్వంపై
- ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 20 వేలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెట్టాలని మంత్రులకు, పార్టీ నేతలకు సూచించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పలువురు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకుపైగానే జరిగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు. గత 15 రోజులకుపైగానే మంత్రులంతా మంచి సమన్వయంతో ప్రచారం చేశారని సీఎం ప్రశంసించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో మంత్రులు చాలా కష్టపడ్డారు. బూత్‌స్థాయిలో ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లారు. లోకల్ లీడర్లతో బాగా కోఆర్డినేషన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని కూడా బలంగా తిప్పికొట్టారు. ఇవన్నీ మన గెలుపులో కీలకం కాబోతున్నాయి’’ అని అభినందించినట్టు సమాచారం.
పోలింగ్ 60 శాతం దాటాలి
జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో పోల్‌మేనేజ్‌మెంట్‌పై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పోలింగ్మొదలైన దగ్గరి నుంచి ముగిసే వరకూ ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం 50 లోపే ఉందని, ఈ సారి 60శాతం దాటేలా చూడాలన్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రం దాకా పంపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలని, పోలింగ్ ఏజెంట్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిసే వరకు మంత్రులంతా పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండాలని, తాను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులకు ఫోన్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల విషయంలో పార్టీ కేడర్ అలర్ట్‌గా ఉండాలని, అవసరమైతే ఎన్నికల అధికారులతోపాటు పోలీసులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందించాలని తెలిపారు. పార్టీ లీగల్ టీంలను కూడా అందుబాటులో ఉంచాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ గెలుపుతో పార్టీ, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరగనున్నదని, ఇది మనపై మరింత బాధ్యతను పెంచనున్నదని అన్నారు.
పోలింగ్ కేంద్రాలపై ఫోకస్ చేయండి: మహేశ్‌గౌడ్
పోలింగ్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ తర్వాత.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు జూబ్లీహిల్స్‌లోని రిక్రియేషన్ క్లబ్‌లో మరోసారి సమావేశమయ్యారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు. ప్రచారంలో సక్సెస్ అయ్యామని, ఇక పోలింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉంటూ పార్టీ నేతలను, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలన్నారు.
