- కాళేశ్వరంలో పనులు స్పీడప్ చేసిన ఆఫీసర్లు
- రూ.30 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం
- కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం వద్ద గోదావరితీరంలో సరస్వతీ అంత్యపుష్కరాలకు మరో మూడునెలల సమయం మాత్రమే ఉన్నది. దీంతో అధికార యంత్రాంగం పనులు స్పీడప్ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గతేడాది మేలో జరిగిన ఆదిపుష్కరాల సమయంలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించగా, ఆ అనుభవాలతో ముందస్తు ప్రణాళికలతో మరో రూ.30 కోట్లతో అంత్యపుష్కరాల పనులను ముమ్మరం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పనుల పురోగతిని దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం..
20 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా కాళేశ్వర క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు దేవదాయశాఖ శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 2027 జులైలో జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించే దిశగా పనులు చేపడుతున్నారు. గతేడాది మేలో జరిగిన సరస్వతీ ఆది పుష్కరాలకు ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించగా, శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గోదావరి నదీతీరంలో సరస్వతీ మాత విగ్రహం, సరస్వతీ ఘాట్, వీఐపీ ఘాట్ల నిర్మాణం చేపట్టారు.
కేశఖండన శాల, మకర తోరణం, ఆర్చీ, భక్తుల విడిది షెడ్లు, ప్రసాద కౌంటర్లు, పుష్కర ఘాట్ల వద్ద గదులు, పిండ ప్రధాన షెడ్డు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి పనులు ప్రారంభించారు. ఆది పుష్కరాలు పూర్తై తొమ్మిది నెలలు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. దేవదాయశాఖ కమిషనర్ హరీశ్ గతేడాది డిసెంబర్వరకే పనులు పూర్తి చేయాలని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ పనుల్లో కదలిక కనిపించడం లేదు. లడ్డూ ప్రసాద కౌంటర్, ఆర్చీ, మహదేవపూర్ ఆర్చీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
అంత్యపుష్కరాలకు రూ.30 కోట్లు..
మే 21 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ అంత్యపుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. మూడు నెలల సమయం ఉండటంతో పకడ్బందీగా పనులు పూర్తయ్యేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 6న కాళేశ్వరంలో పర్యటించిన దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ అభివృద్ధి పనుల ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. కుదురుపల్లి– బీరసాగర్ రోడ్డు, సిరోంచ నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రోడ్డు, వాహన పార్కింగ్ ఏర్పాటు, టెంట్ సిటీ, పార్కింగ్, సరస్వతీ ఘాట్, గోదావరి ఘాట్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు, మ్యూజియం, విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
పనుల్లో నాణ్యతతో పాటు వేగంగా జరిగేలా సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఆది పుష్కరాల నాటి పనులతో పాటు అంత్యపుష్కరాల పనులను ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ పర్యవేక్షణ చేపడుతూ పనుల్లో వేగం పెంచుతున్నారు. మూడు నెలల్లో రానున్న సరస్వతీ అంత్యపుష్కరాలు, వచ్చే ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు ఎగ్జిట్, ఎంట్రెన్స్ దారులతో రూట్ మ్యాప్లు రెడీ చేస్తున్నారు.
