రామడుగు, వెలుగు : తండ్రి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 10 లక్షలు జల్సాల కోసం ఖర్చుచేసి, ఇంట్లో గొడవ జరుగగా.. తల్లిని చంపేశాడు చిన్న కొడుకు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ (60) హత్య కేసులో చిన్నకొడుకు అనిల్‌కుమార్ నిందితుడని రూరల్ ఏసీపీ విజయకుమార్ తెలిపారు. రామడుగు పోలీస్ స్టేషన్లో శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. రామడుగు గ్రామానికి చెందిన ఈరెల్లి గౌరమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మహేష్ సింగపూర్ నుంచి కొన్నిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు.
ఈ నెల 8న అతని పెళ్లి ఉంది. మహేశ్‌కు చెందిన రూ.5 లక్షలు, వడ్లు అమ్మిన రూ.4 లక్షలు, రైతుబంధు రూ.లక్ష తండ్రి కొమురయ్య బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ డబ్బులను చిన్న కొడుకు అనిల్‌కుమార్ జల్సాలకు ఖర్చు చేశాడు. ఈ విషయమై ఇంట్లో గొడవలు జరగగా అనిల్‌కుమార్ ఈ నెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న తల్లి మెడను కోసి హత్యచేశాడు. మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అనిల్‌కుమార్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
