మళ్లీ ధరల భగభగ.. కిరాణాకు మరింత చెల్లించాల్సిందే..!

మళ్లీ ధరల భగభగ.. కిరాణాకు మరింత చెల్లించాల్సిందే..!
  • పెంపును ధ్రువీకరించిన ఏడు కంపెనీలు
  • ముడి సరుకుల ధరలు పెరగడమే కారణం

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో భారతీయ కంపెనీలు త్వరలో తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. టూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేస్ట్, పెయింట్లు, సబ్బులు, ఉప్పు, పాల వంటి నిత్యావసరాల ధరలు మరింత పెరగనున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, వాటి ప్రభావాన్ని ఆర్​బీఐ, ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగ డిమాండ్ నిలకడగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

న్యూఢిల్లీ: పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ఫాస్ట్​ మూవబుల్​కన్జూమర్​ గూడ్స్​(ఎఫ్​ఎంసీజీ) కంపెనీలు టూత్​పేస్టులు మొదలుకొని టైర్లు, పెయింట్లు, డిటర్జెంట్ల వరకు అన్నింటి ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో వరుసగా రెండో క్వార్టర్​లోనూ ధరలు పెరుగుతున్నాయి. హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్​యూఎల్) డిటర్జెంట్లు, డిష్ వాషింగ్ బార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దొడ్ల డెయిరీ, ఏషియన్ పెయింట్స్ సహా కనీసం ఏడు కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమయ్యాయి.

క్రూడ్ ఆయిల్ ఆధారిత ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో గృహోపకరణాల ధరలను పెంచుతున్నట్టు హిందుస్థాన్ యునిలీవర్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ ఏడాది జూన్​లో ద్రవ్యోల్బణం ఆర్​బీఐ నాలుగు శాతం లక్ష్యాన్ని దాటింది. రానున్న నెలల్లో ధరలు మరోసారి పెరగడం,  లోటు వర్షపాతం వల్ల ఆహారం మరింత పెరిగే ప్రమాదం ఉంది. 2027 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని ఆర్​బీఐ అంచనా వేసింది.  భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వర్షపాతంపైనే ద్రవ్యోల్బణ గమనం ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

యుద్ధంతో ఇబ్బందులు
ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా ఇంధన ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల వల్ల గృహోపకరణాల నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు అధికమవుతున్నాయి. ఎలక్ట్రికల్​ వస్తువులు తయారు చేసే హావెల్స్ ఎనిమిది శాతం వరకు ధరలు పెంచగా, టాటా ఉప్పు ధర ఏడు శాతం పెరిగింది. ఈనెల నుంచి నవంబర్ మధ్య వచ్చే  పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారుల ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీపావళి సమయంలో అమ్మకాలు ఊపందుకుంటాయి.

ఇదే సమయంలో కంపెనీలు తమ ఖర్చుల భారాన్ని వినియోగదారులపైకి నెడుతున్నాయి. ధరల పెరుగుదలను గమనిస్తున్నామని,  ద్రవ్యోల్బణం విస్తరిస్తేనే వీటిపై స్పందిస్తామని ఆర్​బీఐ స్పష్టం చేసింది. ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా ఇంధన ధరల ప్రభావంతో ఇతర వినియోగ వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది ఆర్​బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. ఈసారి  కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.