నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు:  సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్​ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గత డిసెంబర్​లో అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కడప జిల్లాకు చెందిన జనార్దన్ (29) ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తూ ఇన్​స్టాగ్రామ్ ద్వారా అనసూయపై దూషణలకు పాల్పడటమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాంకేతికతతో అసభ్యకర వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో కేసులో సోషల్ మీడియాలో సినీనటులు పోస్టులకు అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్న వ్యక్తి వెస్ట్​మారేడ్ పల్లికి ఆటో డ్రైవర్​ అరుణ్ కుమార్​ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.