డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు

డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. కానిస్టేబుల్ నియామక దేహాదారుఢ్య ఈవెంట్స్ లో లాంగ్ జంప్ లెంగ్త్ పెంచడంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 3.8 మీటర్ల నుండి 4 మీటర్ల వరకు పెంచడం వల్ల చాలా మంది అనర్హులుగా తిరిగి వస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు షాట్ పుట్‭లోనూ పెంచిన లెంగ్త్‭ను తగ్గించాలని డిమాండ్ చేశారు. 

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన అభ్యర్థులు.. ఇప్పుడైనా తమకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నారని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు. కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో మార్పులు చేయడం వల్ల ఎంతోమంది అర్హత ఉన్నా అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుందని అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు కాంగ్రెస్ యూత్ కార్యకర్తలను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది.