జులై 11, 12, 13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ

జులై 11, 12, 13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో మూడ్రోజుల పాటు యూత్ కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించనున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మాణిక్ రావ్‌‌ ఠాక్రే తెలిపారు. జులై 11, 12, 13 తేదీల్లో ప్లీనరీ ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇందులో చర్చిస్తామని చెప్పారు. శనివారం గాంధీ భవన్‌‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన ‘బెహ్తర్ భారత్ కీ బున్యాద్ (అద్భుత భారతానికి పునాది)’పోస్టర్‌‌‌‌ను ఆయన ఆవిష్కరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేస్తున్నదని, దానిని బతికించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని యూత్​కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌‌‌‌లో తీసుకున్న నిర్ణయం మేరకు టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కాగా, కర్నాటక ఎన్నికల్లో పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ప్రస్తుతం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు యూత్ కాంగ్రెస్ నుంచి ఇన్‌‌చార్జిలను ఖరారు చేశామన్నారు. సమావేశంలో ఏఐసీసీ స్టేట్ ఇన్‌‌చార్జి కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.