యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలు

యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలు

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ ​షీ టీమ్స్ కు మహిళలు, యువతుల నుంచి వస్తున్న కంప్లయింట్లలో ఎక్కువగా ఫోన్ వేధింపులవే ఉంటున్నాయని పోలీసులు తెలిపారు.  ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వచ్చే వేధింపుల కంప్లయింట్లు ఉన్నాయన్నారు. జులైలో సైబరాబాద్ షీటీమ్స్ కు 103 కంప్లయింట్లు వచ్చినట్లు తెలిపారు. 77 కంప్లయింట్లు వాట్సాప్ నుంచి, మిగిలినవి విమెన్ సేఫ్టీ వింగ్, డైరెక్ట్ వాన్ ఇన్ ద్వారా వచ్చాయన్నారు. వీటిలో ఫోన్​ వేధింపులకు సంబంధించి 32, సోషల్​ మీడియా వేధింపులు 13, బ్లాక్​ మెయిలింగ్ 11 ఉన్నాయన్నారు. మొత్తం 36 కేసులు నమోదు చేశామన్నారు. వేధింపులకు గురిచేస్తున్న వారిలో  మైనర్లు ఏడుగురు,19-24 ఏజ్ గ్రూప్ వారు 37 మంది, 25-35 ఏజ్ గ్రూప్ వారు 65 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.

సోషల్​ మీడియాలో పెడతానంటూ..

జగద్గిరిగుట్టకు చెందిన ఓ యువతి(22) స్టూడెంట్. ఫేస్​బుక్​లో ఓ యువకుడి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ రావడంతో యాక్సెప్ట్​ చేసింది. అతడితో కొద్ది రోజులు చాటింగ్​ చేయగా.. ఇద్దరూ ఫ్రెండ్స్​అయ్యారు. ఆ తర్వాత ఫోన్​నంబర్లు షేర్ చేసుకున్నారు.  కొన్ని రోజుల పాటు ఇద్దరు చాటింగ్ తో పాటు వీడియో కాల్ నుంచి కూడా మాట్లాడుకున్నారు. ఇది గమనించిన యువతి తల్లిదండ్రులు అతడితో ఫోన్​ మాట్లాడవద్దని ఆమెను హెచ్చరించారు. ఇదే విషయాన్ని యువతి సదరు యువకుడితో చెప్పింది.  తనతో ఫోన్ లో మాట్లాడకపోతే ఆమె మొబైల్ నంబర్​ను  ఫేస్​బుక్​లో అప్​లోడ్​ చేస్తానంటూ అతడు యువతిని అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజు యువతి అడ్రస్​ తెలుసుకొని ఆమె  ఇంటికి వచ్చాడు.  ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు. దీంతో ఆమె జగద్గిరిగుట్ట షీ టీమ్స్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని రామంతాపూర్​కు చెందిన  టి. అభిషేక్(21)గా గుర్తించి అతడిని అరెస్ట్​ చేశారు. 

స్నానం చేస్తున్న యువతి వీడియో తీసిన పాలు అమ్మే వ్యక్తి 

ఈ నెల 15న సైబరాబాద్ పరిధిలో ఉండే ఓ యువతి(20) స్నానం చేస్తుండగా బాత్రూం వెంటిలెటర్​ నుంచి ఎవరో  వీడియో తీస్తున్నట్లు అనిపించడంతో  వెంటనే వాట్సాప్​ ద్వారా  షీ టీమ్ కు కంప్లయింట్ చేసింది. షీ టీమ్ సభ్యులు  అక్కడికి చేరుకుని యువతి ఇంటి పక్కన ఉండే సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. నిజాంపేటకు చెందిన పాలు అమ్మే యువకుడు సీలం దుర్గాప్రసాద్(20) సెల్ ఫోన్ లో వీడియో తీసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే దుర్గా ప్రసాద్ తాను తీసిన వీడియోలను మొబైల్​లో నుంచి డిలీట్ చేశాడు.  పోలీసులు అతడిపై కేసు ఫైల్ చేశారు.'