సర్కారీ జాబ్ కోసం పుస్తకాలతో కుస్తీ

సర్కారీ జాబ్ కోసం పుస్తకాలతో కుస్తీ
  • కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, స్టడీ సెంటర్లు ఫుల్
  • వరుసగా గ్రూప్స్, పోలీస్, గురుకుల, జేఎల్.. ఇతర పరీక్షలు
  • సోషల్ మీడియాకు దూరం.. ఈ ఏడాదంతా ప్రిపరేషన్‌‌లోనే


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని యువత పూర్తిగా జాబ్ ప్రిపరేషన్ మూడ్‌‌లోకి వెళ్లిపోయింది. సర్కారీ జాబ్ ఎట్లయినా కొట్టాలని పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ అన్నీ ఒకేసారి రావడం, పోలీసు, గురుకుల పోస్టులు, జేఎల్, డీఎల్, ఇతర డిపార్ట్​మెంట్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుండటంతో నిరుద్యోగులు పరీక్షలకు రెడీ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, స్టడీ సెంటర్లకు పరిమితమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్
అవుతున్నారు.

టీఎస్​పీఎస్సీలో వెబ్​సైట్ వన్​ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లోనే 24 లక్షల మంది రిజస్టర్ అయ్యారు. ఇందులో అన్ని పరీక్షలకు కామన్​గా అటెండ్ అయ్యే అభ్యర్థులు 6 లక్షల నుంచి 8 లక్షల మంది ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్​పెరిగినా.. ఆయా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు, మీటింగ్‌‌లకు యూత్ పెద్దగా రావడం లేదు. యూట్యూబ్‌‌లో క్లాసులు వినడం తప్ప.. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండటం లేదు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే దాదాపు 10 నెలల నుంచి ఏడాది దాకా రాష్ట్రంలో యువత మొత్తం ప్రిపరేషన్‌‌లోనే ఉండనుంది.

వరుస నోటిఫికేషన్లతో..

రాష్ట్రంలో 80 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్‌‌లో భర్తీ చేస్తామని గతేడాది బడ్జెట్ సెషన్స్​లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత కొన్ని నెలలకు కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వాటికి అనుగుణంగా టీఎస్​పీఎస్సీ, పోలీసు రిక్రూట్‌‌మెంట్ బోర్డు నుంచి వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. దీంట్లో గ్రూప్స్​కు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌‌ ఎగ్జామ్ కూడా పూర్తయింది. అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్‌‌కు రెడీ అవుతున్నారు. పోలీసు రిక్రూట్‌‌మెంట్ బోర్డులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, ఈవెంట్స్ పూర్తయ్యాయి. గురుకులాల్లోనూ హాస్టల్ వార్డెన్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్​ జులైలో నిర్వహించేందుకు టీఎస్‌‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్​ 2 కూడా జులై – ఆగస్టులోనే పూర్తి చేయాలని భావిస్తున్నది. అయితే ఒక్కో పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలని వినతులు వస్తున్నాయి. దీంతో గ్రూప్స్ ఎగ్జామ్స్ పూర్తయి, ఫలితాలు రిలీజ్ అయ్యేందుకు ఏడాది పడుతుందని తెలుస్తున్నది.

లక్షల్లో దరఖాస్తులు

గ్రూప్ 4కు 9.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. గ్రూప్ 2కు కనీసం 5 లక్షల మంది అప్లై చేసుకుంటారని అధికారులు చెప్తున్నారు. గ్రూప్ 3కు అదే స్థాయిలో వస్తాయని అంటున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయి.. మెయిన్స్​కు ప్రిపేర్ అవుతున్నవాళ్లు 25 వేల మంది ఉన్నారు. పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్లలో 1.15 లక్షల మంది దాకా అర్హత సాధించారు. వీరంతా మెయిన్స్​కు ప్రిపేర్ కానున్నారు. గురుకులాల్లో అన్ని రకాల పోస్టుల కోసం దాదాపు 5 లక్షల మంది చదువుతున్నారు. జేఎల్, డీఎల్ కోసం 2 లక్షల మంది సిద్ధమవుతున్నారు. ఇక ఇతర పోటీ పరీక్షల నోటిఫికేషన్ల కోసం దాదాపు లక్ష మంది పైనే పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షను ఇదివరకే నిర్వహించింది. లక్షల మంది అర్హులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అనుమతి వస్తే ఇంకో 6 లక్షల మంది టీచర్ పోస్టులకు ప్రిపేర్ కానున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా లక్షల మంది

గ్రామాల్లో ఉండే యూత్ అంతా పట్టణబాట పట్టారు. సిటీలోనే డిగ్రీ పూర్తయిన, పీజీ, ఇతర హయ్యర్ స్టడీస్​ చేస్తున్నవాళ్లు కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్నారు. ఇలా లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్​ సెంటర్లు, స్టడీ సెంటర్లలో ఫుల్ అయిపోయారు. అశోక్ నగర్, దిల్ సుఖ్​నగర్ తదితర ఏరియాల్లో హాస్టళ్లు, రీడింగ్ రూమ్స్ నిండిపోయాయి. ఉస్మానియా, చిక్కడపల్లి లైబ్రరీతోపాటు జిల్లా కేంద్రాల్లోని లైబ్రరీలు, కోచింగ్​ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు అందినకాడికి దోచుకుంటున్నాయి. మరోవైపు యువత రోజంతా ప్రిపరేషన్‌‌కే టైం కేటాయిస్తున్నారు. పోలీస్ ఈవెంట్స్‌‌ కోసం మొన్నటి దాకా గ్రౌండ్లలో కుస్తీలు పట్టిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పుడు లైబ్రరీల బాటపట్టారు.

యూట్యూబ్​లో క్లాసులు

ఎట్లయినా పోస్ట్ కొట్టాలనే తపనతో యూత్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నది. యూట్యూబ్‌‌లోనూ క్లాసులను వింటున్నారే తప్ప ఇతరత్రా చూడటం లేదు. పొలిటికల్ మీటింగ్స్‌‌లో యూత్ ఎక్కువగా లేకపోవడం స్పష్టంగా తెలుస్తున్నది. యువకులు సభలకు రావడం లేదని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో తాము చేపట్టే నిరసన కార్యక్రమాలకు, బహిరంగ సభలకు, ర్యాలీలకు కొంత ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు. ఇది అధికార బీఆర్ఎస్‌‌కు కలిసి వస్తున్నది. మొన్నటి దాకా నిరుద్యోగులంతా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ప్రిపరేషన్​లో మునిగిపోయారు.