ఏపీ పీసీసీ చీఫ్​గా వైఎస్ షర్మిల?

ఏపీ పీసీసీ చీఫ్​గా వైఎస్ షర్మిల?
  • నేడు ఏపీ కాంగ్రెస్​ నేతలతో
  • పార్టీ హైకమాండ్​ భేటీ  
  • షర్మిలకు పదవి, వైఎస్సార్​ టీపీ 
  • విలీనంపై చర్చించే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్​గా వైఎస్ ​షర్మిలను నియమించనున్నట్టు కాంగ్రెస్​ పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే లోక్​సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా ఆ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిపోయిన పార్టీకి మళ్లీ ఊపిరి పోయడానికి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం. 

ఇందులో భాగంగా వైఎస్సార్​టీపీ ప్రెసిడెంట్, వైఎస్ బిడ్డ షర్మిలను ఏపీ కాంగ్రెస్ ​చీఫ్​గా నియమించి ఆమె నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ముఖ్య నేతలు రాహుల్​గాంధీ, కేసీ వేణుగోపాల్​తదితరులు ఏపీ కాంగ్రెస్​నేతలతో సమావేశం కానున్నారు. సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్​గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సీనియర్​నేత కేవీపీ రామచందర్​రావు తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏపీ కాంగ్రెస్​వ్యవహారాల ఇన్​చార్జీ మాణిక్కం ఠాగూర్​కూడా మీటింగ్​లో పాల్గొననున్నారు. షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్​పదవితోపాటు కాంగ్రెస్​పార్టీలో వైఎస్సార్​టీపీ విలీనంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్తున్నారు. 

షర్మిలకు పీసీసీ పదవి లాంఛనమే..?     

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్​లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసేందుకు షర్మిల సిద్ధపడినా.. ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించడంతో విలీనానికి అప్పుడు బ్రేక్​పడింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరుకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​వస్తుండటంతో ఏపీలో పట్టు సాధించడంపై కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిస్తే స్వాగతిస్తామని ప్రస్తుత పీసీసీ చీఫ్ రుద్రరాజు సైతం ప్రకటన చేశారు. వైఎస్ బిడ్డగా పార్టీలో ఆమెకు ఎప్పటికీ స్థానం ఉంటుందన్నారు. అయితే, ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంపై షర్మిల ఇంతవరకూ స్పందించలేదు. వైఎస్ మరణం తర్వాత షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. జగన్ అధికారంలోకి రావడంలోనూ కీలక పాత్ర పోషించారు. తర్వాత తన అన్నతో విభేదాలు రావడంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు సహకరించాలనే పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఆమె పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించడం లాంఛనమేనని తెలుస్తోంది. దీనిపై పార్టీ హైకమాండ్ జనవరి 1వ తేదీన ప్రకటన చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.