బోనులో ఉన్నా పులి పులే..ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదుగుతా : షర్మిల

బోనులో ఉన్నా పులి పులే..ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదుగుతా : షర్మిల

పోలీసులు తనపై దురుసుగాప్రవర్తించారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. తనపై దాడి చేస్తారనే కారణంతోనే పోలీసులను నెట్టేశానని చెప్పారు.  జైలు నుంచి విడుదలయిన షర్మిల మీడియాతో మాట్లాడారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని కేసీఆర్ అంతు చూస్తామంటూ  వార్నింగ్ ఇచ్చారు.  బోనులో పెట్టినా పులి.. పులినేనని ఇంతకింత అనుభవిస్తవ్ కేసీఆర్.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఏప్రిల్ 26న  ఇందిరా పార్కు దగ్గర  దీక్ష కొనసాగుతుందన్నారు.

అరెస్ట్ వారెంట్  ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని షర్మిల అన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పుడు మహిళా పోలీసులు లేరని చెప్పారు.  తన కారుకు అడ్డుపడటానికే కారణమేంటో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోనన్నారు.  మీరు ఎంత తొక్కాలని చూస్తే  అంతా స్పీడ్ తో  పైకి ఎదుగుతానని  అన్నారు.  

 తెలంగాణ అఫ్గనిస్తాన్  లా మారిందని.. తాలిబన్ల పాలన నడుస్తోందని విమర్శించారు షర్మిల. పోలీసులను కేసీఆర్ కుక్కల్లా.. తొత్తుల్లా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.  పోలీసులు తనపై దాడి చేసిన వీడియోలు లేకుండా చేశారని చెప్పారు.  వాళ్లకు కావాల్సిన వీడియోలు వాళ్లు వైరల్ చేసుకున్నారని తెలిపారు. తనపై పోలీసులు మ్యాన్ హ్యాండ్ లింగ్ చేశారని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు ఇంత కన్నా దారుణంగా  కొట్టారని..కేటీఆర్ ఇంతకన్నా బూతులు తిట్టారని షర్మిల గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఇంటికో ఉద్యోగం, నిరుధ్యోగ భృతి ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు షర్మిల. అసలు తెలంగాణలో  కేసీఆర్ కు పాలన చేతనవుతుందా? అని ప్రశ్నించారు.   ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? అని ధ్వజమెత్తారు.  ప్రతిపక్షాలు గొంతు విప్పితే నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇళ్లు  నిర్మించి ఇచ్చారా అని ప్రశ్నించారు.  ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు.