వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకు

వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకు

సీఎం కేసీఆర్‌పై YSR తెలంగాణ పార్టీ  అధినేత్రి  వైఎస్ ష‌ర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో  విమర్శించారు. వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకని ప్రశ్నించారు. కష్టాలొస్తే ఆదుకుంటారని రైతులు ఓట్లు  వేసింది మీకు.. రైతుకు భరోసా ఇవ్వండని బాధ్యత ఇచ్చింది మీకు.. వాళ్లెవరో కొనట్లేదని మీరు కూడా రైతును నట్టేట ముంచితే ఎట్లా? బాధ్యత మీది కానప్పుడు పదవి మీకెందుకు? వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకు?’ అని ష‌ర్మిల ట్వీట్ చేశారు. 'ఎవరో కొంటారనే ఆశకు వరి వేసేదైతే ఎవర్నడిగి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ కాళేశ్వరాన్ని కట్టారు? రైతుల వడ్లు కొననప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఏం లాభం? చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తాం అని చెప్పినవన్నీ మీ కమిషన్ల కోసమేనా? ఆకుపచ్చ తెలంగాణ అంటే రైతు జీవితాలను ఆగం చేయడమా? రైతు నోట్లో మట్టి కొట్టడమా? 'అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు షర్మిల.

'వాపును చూసి బలుపు అనుకుని, నిన్నటి వరకు చివరి గింజ వరకు కొంటానని చెప్పిన కేసీఆర్ చేతులెత్తేశారన్నారు వైఎస్ షర్మిల. ఈ రోజు రైతులను మోసం చేశారు. మీ చేతకాని తనానికి రైతును బలిచేశారు. కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్టుంది మీ తీరు అని అన్నారు. మేము భయంకరమైన ఉద్యమకారులం.. వడ్లు కొనకపోతే కేంద్రాన్ని వెంబడిస్తాం, మెడలు వంచుతాం అని చెప్పిన మీరు.. ఈ రోజు మెడలు వంచుకొని వడ్లు కొనేది లేదంటున్నారు. పేగులు తెగే దాక కొట్లాడాన‌ని చెప్పే కేసీఆర్ , కేంద్రం తీగ లాగితే మీ అవినీతి పేగులు కదులుతాయని కొట్లాట బంద్ పెట్టిండ్రా?' రైతులు గల్లా పడుతరని తప్పించుకుంటున్నవా? అని అన్నారు.

‘ఈ రోజు కొనుగోలు నుంచి తప్పుకోవాలని చేసే డ్రామాలు. మీరు రైతులను కోటీశ్వరుల చేస్తే ఏడేండ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు చనిపోయిండ్రు? వడ్లు కొనకుండా రైతుల ఉసురు తీసుకొంటున్న రైతు ద్రోహులు మీరు. వడ్లు కొనలేనప్పుడు మీ పదవికి రాజీనామా చేయండి. అధికారం నుండి దిగిపోండి’ అని ష‌ర్మిల ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.